బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్ వల్లే ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఈ ఓటమి పట్ల తమకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం ఏపక్షంగా సాగిన తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే కుప్పకూలింది. జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తమ పతనాన్ని శాసించారని చెప్పాడు. 'నిజం చెప్పాలంటే ఈ ఓటమిపై పెద్దగా నిరాశ లేదు. ఆరంభంలో పించ్ చాలా కఠినంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, బర్గర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాల్‌గా మారింది. వారు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్స్‌తో బౌలింగ్ చేశారు. ఆ తర్వాత మీడియం పేసర్లను ఎదుర్కోవడం కూడా కొంచెం కష్టమైంది. స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించడంతో వారు కూడా సత్తా చాటారు.
ఏది ఏమైనా మా బ్యాటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. కనీసం 150-160 పరుగులు చేసి గట్టి పోటీ ఇవ్వాల్సింది. కానీ, ఈ రోజుల్లో ఏది మంచి స్కోరో చెప్పలేం. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా ఆడుతూనే ఉండాలి. పిచ్ కొంచెం కఠినంగా ఉన్న రోజుల్లో ఇది ఒకటి. అందుకే ఏమాత్రం నిరాశ చెందడం లేదు.
ఈ పరాజయాన్ని ఇక్కడే వదిలేసి ముందుకు సాగాలి. మరో మూడు రోజుల్లో మాకు మ్యాచ్ ఉంది. అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. మా జట్టులో చాలా మంది యువకులు ఉండటం ఒక మంచి విషయం. బహుశా అందరికీ ఇది కాస్త ఒత్తిడితో కూడిన ఆరంభం అయి ఉండొచ్చు. కానీ ఒక మ్యాచ్ ముగియడం, అందులో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవడం మంచిదే.
ఇక్కడి నుంచి ఆట మెరుగవుతుందని ఆశిస్తున్నా. నేను వ్యక్తిగతంగా భారీ స్కోర్ల వెంటే వెళ్లాలని నమ్మను. కానీ, 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన వల్ల ఏది సరైన స్కోరో అంచనా వేయడం కష్టంగా తయారైంది. అందుకే 150, 160 లేదా 170 పరుగులు డిఫెండ్ చేసేటప్పుడు మ్యాచ్‌లు 20వ ఓవర్ వరకు వెళ్లడం తక్కువగా చూస్తున్నాం. కాబట్టి బ్యాటర్లు తమ ఆటపై నమ్మకం ఉంచడం ముఖ్యం. బంతి మీ ఏరియాలోకి వస్తే ఖచ్చితంగా షాట్ ఆడాలి.
ఈ రోజు అది వర్కౌట్ కాలేదు. కానీ బ్యాటింగ్‌లో మేం మరింత మెరుగ్గా రాణించగలం. మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు సానుకూలంగా ఉండటం ముఖ్యం. పరిస్థితులు అనుకూలిస్తే.. ఇదే బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు సాధించగలదు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.