Ayush Mhatre: టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే ప్రశంసల జల్లు కురిపించాడు. అతని ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి తమ దగ్గర మాటలు లేవన్నాడు. వైభవ్ అద్భుతమైన బ్యాటరని, తాను ఏమి చేయగలడో ఈ మ్యాచ్‌లో చూపించాడని కొనియాడాడు.
ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఆరో టైటిల్‌ను ముద్దాడింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తమ సీనియర్లు అయిన రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల వారసత్వాన్ని కొనసాగించాలనుకున్నామని, ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని సంతోషం వ్యక్తం చేశాడు.'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. నా భావాలను మాటల్లో చెప్పలేను. కానీ ఇది మాకు ఒక చిరస్మరణీయమైన రోజు. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. మా ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మేం పెట్టుకున్న లక్ష్యాలను అందుకున్నారు. మా ఆటగాళ్లంతా సహజ సిద్దమైన ఆట ఆడారు. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను.

సూర్యవంశీ ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి మా దగ్గర మాటలు లేవు. అతను ఒక అద్భుతమైన బ్యాటర్ అని మాకు తెలుసు. తను ఏమి చేయగలడో ఈ మ్యాచ్‌లో చూపించాడు. మేం కేవలం మా సీనియర్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ ప్రపంచకప్ గెలిచారు. ఇప్పుడు మేం గెలిచాం. గత కొన్ని నెలలుగా మా కోసం కష్టపడిన సపోర్ట్ స్టాఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.'అని ఆయుష్ మాత్రే చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/63) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్‌డెన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కోనర్(67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 115) సెంచరీతో రాణించినా.. బెన్ డాకిన్స్(56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అంబ్రిష్(3/56) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్(2/64), కాన్షిక్ చౌహన్(2/63) రెండేసి వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసారు.