ఐపీఎల్ 2026 సీజన్‌లో స్పిన్నర్ మయాంక్ మార్కండే రాణిస్తే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కు స్పిన్ బౌలింగ్ బలహీనతగా మారిందని, మయాంక్ మార్కండే ఆ లోటును తీర్చితే ఆ జట్టుకు ఏ సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాలు, బలహీనతలను తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు. దీపక్ చాహర్ కూడా సత్తా చాటితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ మరింత భీకరంగా మారుతుందన్నాడు.
'మయాంక్ మార్కండే తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. అతను తన కెరీర్‌ను ఈ ఫ్రాంచైజీతోనే మొదలు పెట్టాడు. అయితే గతంలో చూపిన ప్రభావమే మళ్లీ చూపిస్తాడా అనేది ఇప్పుడున్న ప్రశ్న. అతను తన బౌలింగ్‌లో చాలా మెరుగుపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అతను మరింత పటిష్టమైన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడని, బంతి కూడా బాగా టర్న్ అవుతోందని తెలుస్తోంది. అతను తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తే.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎలాంటి బలహీనత ఉండదు.
ఒక భారతీయ స్పిన్నర్ మిడిల్ ఓవర్లలో తన పాత్రను ఎలా పోషిస్తాడనేది చాలా కీలకం. ఎందుకంటే అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. మిడిల్ ఓవర్లలో రెండు వైపుల నుంచి మంచి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తే.. అది జట్టుకు అతిపెద్ద బలం అవుతుంది. ఇటీవలి కాలంలో ముంబై ఇండియన్స్ ఈ విషయంలో కొంచెం వెనుకబడింది. ఒకవేళ మయాంక్ మార్కండే ఈ ఏడాది తన పనిని సక్రమంగా చేస్తే, ముంబై ఇండియన్స్ జట్టుకు మరింత పటిష్టత లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం.

దీపక్ చాహర్ ఫిట్‌నెస్‌ను ఎప్పుడూ నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతనికి గతంలో ఫిట్‌నెస్ సమస్యలు ఎదురయ్యాయి. రెండో ఆందోళన అతని ప్రదర్శన. గతేడాది అతను సగటున మ్యాచ్‌కు ఒక వికెట్ కూడా తీయలేదు. అతని ఎకానమీ రేటు కూడా తొమ్మిదికి పైగా ఉంది. ముంబై ఇండియన్స్ ఈసారి అతని నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. కొత్త బంతితో వికెట్లు తీసే బౌలర్‌గా అతన్ని తీసుకున్నారు. ఆ పాత్రను అతను స్థిరంగా పోషించాల్సి ఉంటుంది. అతను అలా చేస్తే.. మ్యాచ్‌ను నడిపించడం కెప్టెన్‌కు చాలా సులువు అవుతుంది.
ఒక వైపు నుంచి ట్రెంట్ బౌల్ట్.. మరో వైపు నుంచి దీపక్ చాహర్ ఇద్దరూ కొత్త బంతితో వికెట్లు తీస్తే జట్టు అప్పుడు అవసరమైన విధంగా ఇతర బౌలర్లను వాడుకోవచ్చు. దీపక్ చాహర్ పవర్ ప్లేలో వరుసగా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి పట్టు బిగించగలడు. కాబట్టి, అతను ఫామ్‌లో ఉండటం, వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, అతను ఈ మధ్య ఎక్కువ క్రికెట్ ఆడలేదు. ఇది దీపక్ చాహర్‌కు పెద్ద సవాలు కానుంది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.