ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ బ్యాటర్లలో స్మిత్ ఒకడని కొనియాడాడు. ఫ్యాబ్-4 రేసు నుంచి కోహ్లీ తప్పుకున్నాడని తెలిపాడు.
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ శతకంతో చెలరేగాడు. అంతేకాకుండా టెస్ట్‌ల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. స్మిత్‌కు ఇది 35వ టెస్ట్ సెంచరీ. దాంతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఆసీస్ తరఫున 10 వేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా.. 15వ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే స్మిత్ గురించి మాట్లాడిన రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టీవ్ స్మిత్‌తో పాటు జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ఈ తరం అత్యుత్తమ బ్యాటర్లని అభిప్రాయపడ్డాడు. ఈ జాబితా నుంచి కోహ్లీ వైదొలగాడని పరోక్షంగా వెల్లడించాడు.
'స్మిత్ ఈ జనరేషన్ బెస్ట్ ప్లేయరా? అంటే కాదని వాదించలేం. జో రూట్ కూడా మరో అత్యుత్తమ బ్యాటర్. కేన్ విలియమ్సన్ రికార్డ్ కూడా బాగుంది. గత రెండెళ్లలోనే జో రూట్ అత్యుత్తమ ఆటగాడిగా నిలబడ్డాడు. ఐదారేళ్ల క్రితం నలుగురు ఆటగాళ్లు అత్యుత్తమంగా ఉన్నారు. ఇందులో కోహ్లీ కూడా ఒకడిగా ఉన్నాడు.
జో రూట్ చివరి స్థానంలో ఉండేవాడు. ఎందుకంటే ఇతర ఆటగాళ్లలా అతను శతకాలు నమోదు చేయలేదు. కానీ గత నాలుగేళ్లలోనే అతను 19 సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లీష్ అభిమానులను అడిగితే జో రూటే అత్యుత్తమ బ్యాటర్ అంటారు. ఆస్ట్రేలియన్లను అడిగితే స్మిత్ పేరు చెబుతారు. న్యూజిలాండ్ వాళ్లు కేన్ విలియమ్సన్ బెస్ట్ బ్యాటర్ అంటారు.
కాబట్టి ఎవరు అత్యుత్తమ బ్యాటర్ అనేది చెప్పడం కష్టం. కానీ వారి గణంకాలే ఎవరు అత్యుత్తమ బ్యాటర్ అని చెబుతాయి. కాబట్టి స్మిత్ బెస్ట్ బ్యాటర్ కాదని వాదించలేం.'అని రికీ పాంటింగ్ చెప్పాడు.
2020 వరకు తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత డీలా పడ్డాడు. 2020 వరకు 27 టెస్ట్ సెంచరీలతో ఫ్యాబ్-4లో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అతని కంటే స్మిత్ ఒక సెంచరీ వెనుకంజలో ఉండగా.. కేన్ విలియమ్సన్ 6 శతకాలు తక్కువ చేశాడు. జో రూట్ అయితే 10 శతకాల వెనుకంజలో నిలిచాడు. కానీ గత ఐదేళ్లలో జోరూట్ అత్యుత్తమ ప్రదర్శనతో 36 శతకాలతో టాప్‌లో నిలవగా.. స్మిత్ 35 సెంచరీలు, కేన్ విలియమ్సన్ 32 శతకాలతో కోహ్లీ కన్నా ముందంజలో నిలిచారు. ప్రస్తుతం కోహ్లీ 30 శతకాలతో కొనసాగుతున్నాడు. గత నాలుగేళ్లలో కోహ్లీ 3 శతకాలు మాత్రమే నమోదు చేశాడు.