ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆరుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు.
'మేం బౌలింగ్ చేయబోతున్నాం. పిచ్ బాగున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఇక్కడ ఉండే పిచ్ కంటే ఇది కొంచెం పచ్చ గడ్డితో ఉంది. అందుకే ఇది ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నాం. వాంఖడే మైదానం మా కోట. అభిమానులందరూ మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మేం మంచి క్రికెట్ ఆడి వారిని అలరించాలనుకుంటున్నాం.

మేం రెండు వారాల ముందే ప్రాక్టీస్ మొదలుపెట్టాం. మా జట్టు.. కుర్రాళ్లు, అనుభవం కలిగిన ఆటగాళ్ల కలయికతో ఉంది. రోహిత్, సూర్య, మిచెల్ సాంట్నర్ - ఇలా జట్టులో కెప్టెన్లకు కొదువ లేదు. నేను కేవలం మైదానంలోకి వెళ్లి రాణించడానికి ఉత్సాహంగా ఉన్నాను. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆరుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. వాంఖడే స్టేడియంలో ఈ స్థాయిలో పిచ్‌పై గడ్డి ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సీజన్ కోసం మేం బాగా సన్నదమయ్యాం. కోల్‌కతా, ముంబై వేదికగా కొన్ని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నాం. గత ఫలితాలతో సంబంధం లేకుండా.. ఈ సీజన్‌లో రాణించడంపై ఫోకస్ పెడుతాం. మా జట్టుకు గాయాల బెడద ఉంది. మేం ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. మా ఫారిన్ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబానీ.'అని రహానే చెప్పుకొచ్చాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఏఎం గజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ.