వరల్డ్ బెస్ట్ క్రికెటర్ ఎవరా? అనే ప్రశ్నకు ఎక్కువ మంది చెప్పే సమాధానం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఈ తరం అభిమానులు అయితే విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. మైదానంలో ఈ ఇద్దరూ ఆ స్థాయిలో పరుగుల మోత మోగించారు. 100 సెంచరీలతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డ్ సాధించగా.. అతని శతకాల ఘనతను అందుకునే దిశగా కోహ్లీ సాగుతున్నాడు.
దాంతోనే ఈ ఇద్దర్నీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా ఫ్యాన్స్ పరిగణిస్తారు. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ మాత్రం సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్ ఆల్‌టైమ్ అత్యుత్తమ క్రికెటర్ అని అభిప్రాయపడ్డాడు. అతనిలా ఆడే ఆటగాడు మరేవరూ లేరని చెప్పాడు. తాజాగా స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

సౌతాఫ్రికా దిగ్గజం..
'నేను చూసిన ఆటగాళ్లలో జాక్వస్ కల్లీస్ అత్యుత్తమ క్రికెటర్. అతనో గొప్ప ఆల్‌రౌండర్. నేను అత్యుత్తమ బ్యాట్స్‌మన్ గురించి చెప్పడం లేదు. అత్యంత నైపుణ్యం కలిగిన క్రికెటర్ గురించి మాట్లాడుతున్నా. జాక్వస్ కల్లీస్ టెస్ట్‌ల్లో 44, 45 శతకాలు చేశాడు. బౌలింగ్‌తో దాదాపు 300 వికెట్లు తీసాడు. వీటన్నిటికంటే.. టెస్ట్ క్రికెట్‌లో అసాధారణమైన క్యాచ్‌ల రికార్డ్ అందుకున్నాడు.
కానీ అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. అతనో గొప్ప ఆల్‌రౌండర్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇతర ఆటగాళ్లలా అతని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నా దృష్టిలో మాత్రం అతనే ఆల్‌టైమ్ బెస్ట్ క్రికెటర్.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

లారా నేచురల్ స్టార్..
సహజ నైపుణ్యం కలిగిన అత్యుత్తమ బ్యాటర్ ఎవరా? అనే ప్రశ్నకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అని పాంటింగ్ బదులిచ్చాడు. ఇక జాక్వస్ కల్లీస్ సౌతాఫ్రికా తరఫున 166 టెస్ట్‌లు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 13289 పరుగులు చేసిన కల్లీస్ వన్డేల్లో 11579, టీ20ల్లో 666 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో 292, వన్డేల్లో 273, టీ20ల్లో 12 వికెట్లు తీసాడు.
ఐపీఎల్‌లో తొలి రెండు సీజన్లు ఆర్‌సీబీకి ఆడిన అతను ఆ తర్వాత కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 2400 పరుగులతో పాటు 65 వికెట్లు పడగొట్టాడు. బ్రియాన్ లారా వెస్టిండీస్ తరఫున 131 టెస్ట్‌లు, 299 వన్డేలు ఆడి 11953, 10405 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 53 శతకాలు నమోదు చేశాడు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది.