చప్పగా సాగుతున్న ఆసియా కప్ 2025 టోర్నీని హీటెక్కిస్తుందని భావించిన భారత్-పాక్ పోరు తీవ్రంగా నిరాశపర్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. మరోవైపు సమష్టిగా చెలరేగిన భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ముఖం చాటేసాడు.
భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభావమో లేక మరే కారణమో తెలియదు కానీ బ్రాడ్‌కాస్టర్‌తో పాకిస్థాన్ కెప్టెన్ మాట్లాడలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్‌తో పాటు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడగా.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను మాత్రం బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేయలేదు. ఇది ప్రేక్షకులతో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సంప్రదాయం ప్రకారం ఓడిన జట్టు కెప్టెన్ అందరి కంటే ముందు మాట్లాడుతాడు. ఓటమికి గల కారణాలను చెప్పడంతో పాటు జట్టుగా చేసిన తప్పిదాలు ఏంటో వివరిస్తారు. అంతేకాకుండా తదుపరి మ్యాచ్ వ్యూహాల గురించి కూడా పంచుకుంటారు. కానీ తాజా మ్యాచ్ అనంతరం మాత్రం పాక్ కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్స్ కనిపించకుండా పోయాడు.

భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతోనే సల్మాన్ అలీ అఘా డ్రెస్సింగ్ రూమ్‌లో దాక్కొని ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లను పక్కనపెట్టి మరీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే జీర్ణించుకోలేని ఓటమిని అందిస్తావా? అని సల్మాన్ అలీ అఘాపై పాక్ నెటిజన్లు మండిపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సల్మాన్ అలీ అఘా కొంపముంచింది. అంతేకాకుండా బ్యాటింగ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.