న్యూజిలాండ్‌తో జరగనున్న అప్‌కమింగ్ మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగే తన భారత జట్టును మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. జనవరి 11 నుంచి వడదోర వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 14న రాజ్ కోట్ వేదికగా రెండో వన్డే.. జనవరి 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది. జనవరి 21 నుంచి 31 వరకు న్యూజిలాండ్‌తోనే టీమిండియా ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 8 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది.
ఈ మెగా టోర్నీతో పాటు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ వన్డే టీమ్‌ను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నేపథ్యంలో ఈ జట్టు ఎంపికను ఆలస్యం చేసింది. శనివారం ఈ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇంతలోనే మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టును అంచనా వేసాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఒక్క ఆటగాడిని కూడా ఆకాశ్ చోప్రా ఎంపిక చేయలేదు. కనీసం వారి పేరును కూడా ప్రస్తావించలేదు. ఈ జట్టుకు సంబంధించిన వివరాలను ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించాడు. 'శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా తిరిగి వస్తాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అతనితో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డేలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేసినా.. అతను బెంచ్‌కే పరిమితమవుతాడు.
మూడో స్థానంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయిన విరాట్ కోహ్లీ ఆడుతాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. కాబట్టి అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కుతుంది. ఐదో స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ ఆడుతాడు. ఈ సిరీస్‌కు అతనే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని అనుకుంటున్నా.
అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల్లో ఒకరికి మాత్రం జట్టులో అవకాశం దక్కుతుంది. జడేజా గత సిరీస్‌లో 50-50గా రాణించాడు. దీర్ఘ కాల ప్రణాళికలను పరిగణలోకి తీసుకుంటే అక్షర్ పటేల్‌కు అవకాశం ఇవ్వాలి. టీ20 సిరీస్, ప్రపంచకప్ నేపథ్యంలో జడేజాకే అవకాశం దక్కవచ్చు. వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మలను కూడా ఎంపిక చేయాలి. పేసర్లుగా హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణతో పాటు సిరాజ్‌ను తీసుకురావాలి. వారికి బ్యాకప్‌గా ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేయాలి. బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ జట్టులో కొనసాగుతాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి అవసరం లేదు. అతని ఫామ్ కూడా గొప్పగా లేదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మహమ్మద్ షమీతో పాటు సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్‌లను ఆకాశ్ చోప్రా విస్మరించడం చర్చనీయాంశమైంది.
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.