భారత్‌తో క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాము అడుక్కోమని, భారత్‌తో ఎప్పుడు చర్చలు జరిగినా సమానా స్థాయిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ నఖ్వి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
గతంలో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను పున:రుద్దరించేందుకు పీసీబీ బాగా ప్రయత్నించింది. కానీ ఆ విన్నపాలను బీసీసీఐ తిరస్కరించింది. దాంతో ఇరు జట్లు మల్టీ నేషన్ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీపడుతున్నాయి. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లోనే తలపడున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నా.. ఆ జట్టుతో ఆడేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. సుమారు 18 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌లతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. కానీ మల్టీ నేషనల్ ఈవెంట్స్‌లో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో ఆసియాకప్ 2025కు మార్గం సుగుమమైంది.

వాస్తవానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే ఉన్నాయి. కానీ పాకిస్థాన్.. భారత్‌లో పర్యటించేందుకు సుముఖంగా లేకపోవడంతో తటస్థ వేదికైన యూఏఈలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. అంతకుముందు పాకిస్థాన్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అక్కడికి వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దాంతో యూఏఈ వేదికగా భారత్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆ సమయంలోనే ఇరు దేశాల మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు అంగీకరించాయి.
ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు భారత్ ఆడదని, ఆ దేశంలో కూడా పర్యటించదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పీసీబీ ఛైర్మన్ నఖ్వి సైతం తాము ఇక నుంచి భారత్‌ను అడుక్కోమని స్పష్టం చేశారు.ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన.. ఇక నుంచి భారత్‌తో సమంగా తమను చూడాలన్నారు. 'ఇక నుంచి చర్చలు ఎప్పుడూ జరిగినా అవి భారత్‌తో సమాన స్థాయిలో ఉంటాయి. ఇక నుంచి సంప్రదింపుల కోసం పాకిస్థాన్ అడుక్కునే పరిస్థితి ఉండదు. ఆ సమయం ముగిసింది. ఇక నుంచి భారత్ ఎంతంటే.. పాకిస్థాన్ కూడా అంతే.'అని నఖ్వి స్పష్టం చేశారు.
సమీప భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని, మల్టీ నేషనల్ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసియాకప్ 2025లో ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే ఫైనల్‌తో సహా మొత్తం మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.