కోల్‌కతా: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నితీష్ రాణా.. జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేస్తే ఓటములే ఎదురవుతాయన్నాడు.
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. సరైన శుభారంభం దక్కకపోతే 236 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. అజింక్యా రహానే అసాధారణ బ్యాటింగ్‌తో మా పతనాన్ని శాసించాడు. మేం ఇంత స్కోర్‌ను ఎలా ఇచ్చామనేది జీర్ణించుకోలేకపోతున్నా. ఈ మ్యాచ్‌లో మాకు కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. కానీ తప్పిదాలను మెరుగుపరుచుకోకుంటే.. చేసిన తప్పిదాలనే మళ్లీ మళ్లీ చేస్తుంటే ఇలాంటే ఓటములే ఎదురవుతాయి.'అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్. అజింక్యా రహానే(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71), డేవాన్ కాన్వే(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), శివమ్ దూబే(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో కుల్వాంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జాసన్ రాయ్(26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), రింకూ సింగ్(27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ సింగ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.