టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ దక్కింది. అప్‌కమింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) 2025లో ఈ విశాఖ కుర్రాడు భీమవరం బుల్స్‌ను నడిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఏపీఎల్ 2025 మెగా వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని భీమవరం బుల్స్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ కెప్టెన్సీ చేయలేదు. భీమవరం బుల్స్‌కే తొలిసారి సారథ్యం వహించబోతున్నాడు.
గత సీజన్‌లో నితీష్.. గోదావరి టైటాన్స్ జట్టుకు ఆడాడు. గోదావరి టైటాన్స్ అతన్ని రూ.15.6 లక్షల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఏపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం గమనార్హం. ఐపీఎల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్.. ఐపీఎల్ 2025లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్..22.75 సగటుతో 131 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలపై ప్రభావం చూపింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆగస్ట్ 8 నుంచి 24 వరకు జరగనుంది. ఈ లీగ్‌లో ఈ సారి కొత్తగా మొత్తం 7 జట్లు తలపడుతున్నాయి. ఇది ఏపీఎల్ నాలుగో సీజన్ కాగా.. పాత 6 జట్లను రద్దు చేసి కొత్తగా 7 జట్లను ప్రవేశపెట్టారు. జూలై 14న విశాఖ వేదికగా వేలం నిర్వహించగా.. 520 మంది ఆటగాళ్ల పాల్గొన్నారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి, వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ లీగ్ ఆడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు ఆంధ్ర రంజీ స్టార్స్, ఐపీఎల్ ప్లేయర్స్ షేక్ రషీద్, రికీ భూయి, పైల అవినాష్,త్రిపురణ విజయ్, సత్యనారయణ రాజులు కూడా బరిలోకి దిగుతున్నారు.
1. అమరావతి రాయల్స్ - కెప్టెన్: హనుమ విహారి
2. భీమవరం బుల్స్ - కెప్టెన్: నితీష్ కుమార్ రెడ్డి
3. కాకినాడ కింగ్స్ - కెప్టెన్: కె. ఎస్. భరత్
4. రాయల్స్ ఆఫ్ రాయలసీమ - కెప్టెన్: షేక్ రషీద్
5. సింహాద్రి వైజాగ్ లయన్స్ - కెప్టెన్: రికీ భూయి
6. తుంగభద్ర వారియర్స్ - కెప్టెన్: మహ్దీప్
7. విజయవాడ సన్‌షైనర్స్ - కెప్టెన్: అశ్విన్ హెబ్బర్