టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అరంగేట్ర ఆస్ట్రేలియా పర్యటనలోనే అసాధారణ బ్యాటింగ్‌తో ఈ తెలుగోడు సెంచరీ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సంచలన ఆటతీరుతో టీమిండియాను ఆదుకున్నాడు. నాటకీయ పరిణామాల మధ్య.. తన తండ్రి చూస్తుండగా.. సినిమాటిక్ తరహాలో తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్నాడు.
కొడుకు శతకంతో నితీష్ కుమార్ తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సీన్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి హైలైట్‌గా నిలిచింది. అయితే అందరి క్రికెటర్లలానే నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ వెనుక పుట్టెడు దు:ఖం ఉంది. ముఖ్యంగా అతని తండ్రి గొప్ప త్యాగం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..
కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేసాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించాడు. అతనిది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవాడు. నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామ చేశాడు. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై నమ్మకంతో ముత్యాల రెడ్డి వదిలేసాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో..
ఈ నిర్ణయంతో బంధువులు అంతా తన తండ్రిని మందలించారని, కానీ ఆయన వాటిని పట్టించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే తన తండ్రి తనను వదిలి పెట్టి వెళ్లలేదని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి.. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు.
ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్‌గా సత్తా చాటాడు. ఇండియా అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు.
సన్‌రైజర్స్‌హైదరాబాద్ తో స్టార్‌గా..!
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభంలో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్.. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది.
సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌తో మొదలైన అతని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు.
వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకొని జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కొడుకుపై నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అతని కెరీర్‌కు అండగా నిలిచిన ముత్యాల రెడ్డికి నెటిజన్లు సలామ్ చేస్తున్నారు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని ఏకాగ్రతతో సక్సెస్ సాధించిన నితీష్‌ను కూడా అభినందిస్తున్నారు.