టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను డై హార్డ్ ఫ్యాన్ అని యువ పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. తనకు టీమిండియాలో చోటు దక్కేవరకు విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వద్దని బలంగా కోరుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్.. అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను ఆదుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి తన క్రికెట్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్..
'విరాట్ కోహ్లీకి నేను డై హార్డ్ ఫ్యాన్. ఆయన ఆట చూస్తూనే పెరిగాను. సెంచరీలు చేసిన తర్వాత కోహ్లీ చేసే సంబరాలు నాకు చాలా ఇష్టం. ఓ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీని నేను దగ్గరగా చూశాను. ఆయనకు దూరంగా ఉండి ఫొటో తీసుకున్నాను. ఆ సమయంలో కోహ్లీ చాలా ఫేమస్. సెల్ఫీ దిగే అవకాశం కూడా నాకు దక్కలేదు. కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం.
టీవీల్లో ఆయన ఆటను చూసిన ప్రతీసారి నా వయసును లెక్కించుకునేవాడిని. నేను టీమిండియాలోకి వచ్చే సరికి కోహ్లీ రిటైర్ అవ్వద్దని ఆ దేవుడిని కోరుకునేవాడిని. కానీ నా అభిమాన క్రికెటర్ చేతుల మీదుగా అరంగేట్ర టెస్ట్ క్యాప్ అందుకున్నాను. అదృష్టవశాత్తు తొలి మ్యాచ్‌లోనే కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అంతేకాకుండా నాన్ స్ట్రైకర్‌గా కోహ్లీ సెంచరీ చూశాను. నేను కూడా తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు ప్రయత్నించాను. ఆ మ్యాచ్ నాకు గొప్ప అనుభూతి.

మా నాన్న వల్లే..
నా కెరీర్ కోసం మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. తన ఉద్యోగాన్ని వదిలేసారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఏ రోజు నాకు ఇబ్బంది కలగించలేదు. ఆటను ఆస్వాదించాలని చెప్పేవారు. ఆయన లేనిది నేను లేను. ఓ మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుగా ఆయనను సంతోషపరిచినందుకు గర్వపడుతున్నాను. మా నాన్న ముఖంలోని సంతోషం విభిన్నమైన అనుభూతిని, గర్వాన్ని ఇచ్చింది.
టీమిండియాలోకి వచ్చిన కొత్తలో విరాట్ కోహ్లీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను. ఆయన ఆటను ఆరాధిస్తూ పెరిగిన నాకు ఎలా పలకరించాలో అర్థం కాలేదు. ఏ సమస్య వచ్చినా కేఎల్ రాహుల్‌తో మాట్లాడి పరిష్కరించుకుంటున్నా. క్రీజులోకి వెళ్లి కాస్త సమయం గడిపి ఆడమని సలహా ఇచ్చాడు. నేను ఎక్కువగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. అది కూడా నా బ్యాటింగ్‌కు బాగా ఉపయోగపడింది.'నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.