భారత జట్టులో చోటు దక్కిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి ఫోన్ రాగానే తన కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైందని తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. తన తండ్రి అయితే తీవ్రంగా ఏడ్చాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జింబాబ్వే పర్యటనకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
అయితే గాయం కారణంగా అతను చివరి నిమిషంలో ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీమిండియాకు ఆడే అవకాశాన్ని తృటిలో చేజార్చుకోవడంపై నితీష్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తీవ్ర నిరాశకు గురయ్యా..
గాయంతో చివరి నిమిషంలో భారత జట్టుకు దూరమవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా అభినందిస్తూ వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడని చెప్పుకొచ్చాడు. 'చివరి నిమిషంలో టీమిండియాకు ఆడే అవకాశం చేజారడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆటలో గాయాలు సహజమేనని నాకు నేను సర్దిచెప్పుకున్నా.
ఈ విషయంలో నిరుత్సాహనికి గురికావాల్సిన అవసరం లేదని భావించాను. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాను. అతి త్వరలోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతానని ఆశిస్తున్నా.
మా నాన్న బాగా ఏడ్చాడు..
జింబాబ్వే పర్యటనకు జట్టును ప్రకటించే రెండు రోజుల ముందు నాకు బీసీసీఐ నుంచి కాల్ వచ్చింది. అప్పటికే జింబాబ్వే పర్యటనకు నేను ఎంపికవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. నేను కూడా అవకాశం దక్కుతుందని భావించా. అనుకున్నట్లే బీసీసీఐ నుంచి టీమిండియాకు ఎంపికయ్యారనే కాల్ వచ్చింది.
నా జెర్సీ నంబర్‌తో పాటు సైజ్ వివరాలను తీసుకున్నారు. దాంతో నేను చాలా సంతోషానికి గురయ్యాను. ఆ ఆనందాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. వెంటనే మా నాన్నకు ఈ విషయం చెప్పాను. ఆయన సంతోషంతో ఏడ్చాడు. మా అమ్మ కూడా చాలా భావోద్వేగానికి గురైంది. తల్లిదండ్రుల గర్వపడేలా చేయడానికి మించిన ఫీలింగ్ మరొకటి ఉండదు.
గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది..
దురదృష్టవశాత్తు నేను గాయపడటంతో చివరి నిమిషంలో భారత జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతి త్వరలోనే నేను టీమిండియా ఆడుతాననే నమ్మకం ఉంది. నా క్రికెట్ ప్రయాణం సాఫీగానే సాగుతోంది. అదృష్టవశాత్తు నాకు మంచి అవకాశాలే దక్కాయి. మహీ భాయ్ ముందు మ్యాచ్‌ను ముగించడాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను.
ఇది నాకు చాలా గొప్ప విషయం. పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టును ఆదుకోవడం కూడా గొప్ప ఇన్నింగ్సే. ఓ ఆటగాడిగా అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటంపైనే నేను ఎప్పుడూ ఫోకస్ పెడుతాను. అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడితే చాలా సంతోషంగా ఉంటుంది.
ఐపీఎల్ 2024 సందర్భంగా నేను విరాట్, మహీభాయ్‌తో ఎక్కువగా మాట్లాడలేదు. వారి ఆటోగ్రాఫ్స్ మాత్రమే తీసుకున్నాను. నా ప్రశ్నలతో వారిని ఇబ్బందిపెట్టాలనుకోలేదు. కోహ్లీ ఓ దిగ్గజం. మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ఆయనను చూసే నేర్చుకున్నా. క్రిస్టియానో రోనాల్డో నా ఆరాధ్య ఆటగాడు.
హార్దిక్ భాయ్ మెసేజ్ చేశాడు..
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్దిక్ పాండ్యా నాకు మెసేజ్ చేశాడు. హార్దిక్ మెసేజ్ నోటిఫికేషన్ చూసి అది ఫేక్ అకౌంట్ అనుకున్నా. కానీ ఓపెన్ చేసి చూస్తే అధికారిక అకౌంట్. 'ఈ సీజన్ నీకు అద్భుతంగా సాగింది. ఇలానే ఆడుతూ ఉండు. నిన్ను కలిసేందుకు నేను ఎదురుచూస్తున్నా. అతి త్వరలోనే మనం మాట్లాడుకుందాం.'అని హార్దిక్ పాండ్యా మెసేజ్ చేశాడు. అతని మెసేజ్ నాకు సంతోషాన్నిచ్చింది. చాలా మంది మేం పోటీదారులమంటారు. కానీ అతను ఓ జీనియస్'అని నితీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు.