టీమిండియా యువ ఆల్‌రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌కి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ జట్టును నడిపించనున్నాడు.
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో పాటు రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌లు భారత్-ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 ప్రారంభానికి ముందు భారత్-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం పెర్త్‌లో టీమిండియా ఆటగాళ్లతో కలిసి అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.
భారత్-ఏ తరఫున సత్తా చాటే ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటి టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డిని టెస్ట్ ఫార్మాట్‌కు కూడా సిద్దం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
భారత టెస్ట్ టీమ్‌లో పేస్ ఆల్‌రౌండర్ లేక గత కొంతకాలంగా టీమిండియా ఇబ్బంది పడుతోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ పేస్ ఆల్‌రౌండర్ లోటు కనబడింది. బ్యాటింగ్‌తో పాటు సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేయగల పేస్ ఆల్‌రౌండర్ల కోసం టీమిండియా అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దుతోంది. భారత్-ఏ తరఫున అతను మెరుగైన ప్రదర్శన చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత్-ఏ జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్(వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజీత్, ఇషాన్ కిషన్(కీపర్), అభిషేక్ పోరెల్(కీపర్), ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవ్‌దీప్ సైనీ, మానవ్ సుతార్, తనూష్ కోటియన్.