IND vs BAN: అందుకే చిత్తుగా ఓడాం: బంగ్లాదేశ్ కెప్టెన్
బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత్ చేతిలో చిత్తుగా ఓడామని బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తాన తెలిపింది. బహుషా ఒత్తిడి వల్ల తమ ఆట గాడి తప్పవచ్చని అభిప్రాయపడింది. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్ చేరగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నిగర్ సుల్తాన.. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంతోనే ఓటమిపాలయ్యామని తెలిపింది. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినట్లుగా ఈ మ్యాచ్‌లో చేయలేకపోయాం. మా ఫీల్డింగ్ కూడా మెరుగ్గా లేదు. గత మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాం. కానీ ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాం. బహుషా అదే ఒత్తిడి అనుకుంటా. ఈ రోజు మా జట్టు మొత్తానికి కలిసి రాలేదు. మేం భారత్‌ను మేం ఛేదించగల స్కోర్‌కే పరిమితం చేయాలనుకున్నాం. మా బ్యాటింగ్ పవర్ ప్లే కూడా బాలేదు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. మేం బాగా బౌలింగ్ చేశాం. అవకాశాలను సృష్టించుకున్నాం. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ టోర్నీలో మేం చాలా సాధించామని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం మేం లిమిటెడ్‌గా ఆడామని అనిపించింది. వచ్చేసారి మరింత దూకుడుగా ఆడాలనుకుంటున్నాం.'అని నిగర్ సుల్తాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. షె ఫాలీ వర్మ(40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(24), రిచా ఘోష్(21), ప్రతికా రావల్(20) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(2), దీప్తి శర్మ(13), భార్తి ఫుల్మాలి(0) తీవ్రంగా నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తాన ఖాటున్ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులే చేసి ఓటమిపాలైంది. దిలారా అక్తర్(21), షోర్నా అక్తర్(22 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/26), నందని శర్మ(2/10) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. తెలుగు తేజం శ్రీచరణి, ప్రేమ్ రావత్‌కు చెరో వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


