
లండన్: ఓ సిరీస్ సందర్బంగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తాను మాట్లాడటం ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నచ్చలేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ తెలిపాడు. 2012 భారత పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు ముందు అప్పటి కోహ్లీ ప్రియురాలైన అనుష్క శర్మతో తాను సరదాగా మాట్లాడానని, ఇది చూసి కోహ్లీ తట్టుకోలేకపోయాడని కాంప్టన్ గుర్తు చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో నేను బ్యాటింగ్ చేసే ప్రతిసారి కోహ్లీ 'ఆమె నా ప్రియురాలు'అని చెప్పే ప్రయత్నం చేశాడన్నాడు.
పోడ్‌క్యాస్ వేదికగా లైవ్ సెషన్‌లో పాల్గొన్న కాంప్టన్ 2012 భారత పర్యటనకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. 'ఆ సిరీస్‌కు ముందు ఓ రోజు సాయంత్రం కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్, నేను మరికొంతమంది అలా సరదాగా బయటకు వెళ్లాం. విరాట్ లవర్ కూడా మాతోనే ఉంది. ఆమెతో కొద్దిసేపు నేను మాట్లాడాను. అనుష్క కూడా మంచిగా మాట్లాడింది. ఇది కోహ్లీకి నచ్చలేదనుకుంటా.. ఆ సిరీస్‌లో నేను బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి అతను నా దగ్గరకు వచ్చి.. ఆమె నాగర్ల్ ఫ్రెండ్ అని చెప్పే ప్రయత్నం చేసేవాడు.
ఇక ఆమె కూడా కోహ్లీ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇదే విషయాన్ని పట్టుకొని కోహ్లీని స్లేడ్జ్ చేయాలనుకున్నాం. అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనుకున్నాం. కానీ అతనో వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని ఆట ముందు మా పప్పులు ఉడకలేదు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో మాకు బదులిచ్చాడు. అతని కెరీర్ కూడా అలానే దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ ఆ ఘటనను తలుచుకుంటే చాలా సరదాగా ఉంటుంది. కోహ్లీని చూసినప్పుడల్లా అది గుర్తొచ్చి నవ్వొస్తుంది.'అని కాంప్టన్ తెలిపాడు. ఇక ఆ మూడు టెస్ట్‌లో సిరీస్‌లో భారత్ 1-2తో ఓటమిపాలైంది.