టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కొత్త కోచ్ నియామకంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్‌ను మంగళవారం బీసీసీఐ నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.
అశోక్ మల్హోత్రా ఛైర్మన్‌గా జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీ.. గంభీర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా.. నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు సీనియర్ ఆటగాళ్లను కొనసాగించే విషయంపై, ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

అయితే టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవాలంటే ఫార్మాట్‌కో టీమ్ సిద్దం చేయాలని గంభీర్ ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. టీ20, వన్డే, టెస్ట్‌లకు మూడు వేర్వేరు జట్లను రెడీ చేయాలని, అప్పుడే ఐసీసీ టైటిల్ గెలవగలమని గంభీర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లను టెస్ట్ క్రికెట్‌కుపరిమితం చేసి కుర్రాళ్లను టీ20ల్లో.. కాస్త అనుభవం కలిగిన ఆటగాళ్లను వన్డే ఫార్మాట్‌లో కొనసాగించాలని గంభీర్ సూచించినట్లు సమాచారం.
అంతేకాకుండా టీమ్ సమష్టి ప్రదర్శనకు తప్పా వ్యక్తిగతంగా ఏ ఆటగాడికి ప్రాధాన్యత ఇవ్వకూడదని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ భారత క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 35 ఏళ్ల విరాట్ కోహ్లీ, 37 ఏళ్ల రోహిత్ శర్మలకు కూడా గుడ్ బై చెప్పేందుకు గంభీర్ రెడీ ఉన్నట్లు సమాచారం.
గతంలో ధోనీ చేసిన మార్పుల తరహాలోనే సీనియర్ ఆటగాళ్లకు ఉద్వాసన పలికి భారత జట్టును కుర్రాళ్లతో నింపేయాలనే ఆలోచనతో గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆటగాళ్ల విషయంలో గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి గంభీర్ తీసుకొచ్చే మార్పులు ధోనీ తరహాలో సంచలన విజయాలు అందిస్తాయో.. లేక గ్రేగ్ చాపెల్ తరహాలో విపత్కర పరిస్థితులు ఎదురవుతాయా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.