
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా సాగిన ఈ మెగా ఈవెంట్‌లో విశ్వవిజేతగా కేన్ విలియమ్సన్ సేన నిలిచింది. భారత్‌తో జరిగిన ఫైనల్లో ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కివీస్ 8 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. చెత్త బ్యాటింగ్.. పేలవ బౌలింగ్‌తో కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. ప్రత్యర్థి అదిరిపోయే ప్రదర్శన ముందు తేలిపోయింది.
భారత్ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసి అలవోకగా విజయాన్నందుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 6 ఫోర్లు 47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఏకంగా 96 భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరస్మరణీయ విజయాన్నందించారు. ఇది న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.. అయితే 144 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలిసారి జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్‌కు మరిచిపోలేని వీడ్కోలు లభించింది.
ఇక 64/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 73 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(41), రోహిత్ శర్మ(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15), రహానే (15), జడేజా(16), అశ్విన్(7) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతూ 19/0తో టీ బ్రేక్‌కు వెళ్లింది. విరామం అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్(9) స్టెప్ ఔటై ఆడే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు. మరికొద్దిసేపటికే మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(19)ను సైతం అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. కానీ ఇతర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడం.. క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(59 బంతుల్లో 26 బ్యాటింగ్), రాస్ టేలర్ (75 బంతుల్లో 34 నాటౌట్) నిలకడగా ఆడటంతో భారత్ పరాజయం ఖాయమైంది.
బుమ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను చతేశ్వర్ పుజారా నేలపాలు చేయడంతో భారత్ పూర్తిగా డీలా పడింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చెలరేగిన పేసర్‌లు సెకండ్ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయ్యారు. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ తీయకపోగా.. పరుగులిచ్చుకున్నారు. దాంతో భారత్ ఓటమి పాలైంది. తుది జట్టు ఎంపిక, చెత్త బ్యాటింగ్, జస్‌ప్రీత్ బుమ్రా వైఫల్యం, ప్రతికూల వాతవారణ పరిస్థితులతో పాటు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసాయి.