
దుబాయ్: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ తప్పుకుంది. కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం టీనేజర్లు దేశం దాటి వెళ్లి వస్తే కఠినమైన ఆంక్షల మధ్య క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో పలువురు క్రికెటర్‌లు విముఖత చూపడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆఖరి నిమిషంలో తప్పుకున్నట్లు ప్రకటించింది. న్యూజిలాండ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌ను చివరి నిమిషంలో చేర్చారు.
ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు పోటీలు జరుగుతాయి. టైటిల్ కోసం 14 దేశాలు 48 మ్యాచుల్లో తలపడతాయి. టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి కరీబియన్ దేశాల్లో నిర్వహించడం విశేషం. ఈ మేరకు ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. ''ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఎప్పుడూ ప్రత్యేకమైందే. ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.
జాతీయ జట్లకు ఆడే భవిష్యత్తు ఆటగాళ్లను నిర్ణయించే వాటిల్లో ఇదొకటి. అంతర్జాతీయంగా ఇతర దేశాల క్రికెటర్లతో ఆడే అవకాశం కల్పించడం వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు. అయితే ఈసారి వెస్టిండీస్ వేదికగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అన్ని జట్లు మంచి ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి'' అని చెప్పారు. కరీబియన్ దీవుల్లోని నాలుగు దేశాల్లో పది మైదానాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అంటిగ్వా అండ్ బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగొలో జరుగుతాయని పేర్కొన్నారు.
ఇక 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ 'ఎ'లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇంగ్లండ్. గ్రూప్ 'బి'లో ఉగాండ, ధక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి గత ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు చోటు కల్పించారు. గ్రూప్ 'సి'లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా. గ్రూప్ 'డి'లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లుకు అవకాశం కల్పించారు. ఇక టీమిండియా షెడ్యూల్ విషయానికి వస్తే.. జనవరి 15న దక్షిణాఫ్రికాతో, 19న ఐర్లాండ్‌తో, జనవరి 22న ఉగాండాతో తలపడనుంది.