వన్డేల్లో న్యూజిలాండ్ సరికొత్త చరిత్రను లిఖించింది. 38 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 7 ప్రయత్నాల తర్వాత 8వ పర్యటనలో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
1988లో తొలిసారి వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌కు గత ఏడు ప్రయత్నాల్లో భంగపాటు ఎదురైంది. కానీ ఈ సారి ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగి సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచింది. సిరీస్ డిసైడర్ అయిన ఆఖరి మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించి టీమిండియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. గతేడాది ఇదే తరహాలో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన న్యూజిలాండ్.. ఈ ఏడాది మరో విజయంతో కోలుకోలేని దెబ్బతీసింది.

2016 నుంచి సొంతగడ్డపై భారత్ ఓడిన మూడో సిరీస్ ఇది. ఆస్ట్రేలియా చేతిలో రెండు సార్లు ఓడిన భారత్.. తాజాగా న్యూజిలాండ్‌తో మరో ఓటమి చవిచూసింది. ఈ మధ్య కాలంలో మొత్తం 19 సిరీస్‌లు ఆడిన భారత్ 16 గెలిచింది. ఇండోర్ వేదికలో వరుసగా ఏడు విజయాల తర్వాత భారత్‌కు ఎదురైన తొలి పరాజయం ఇదే. ఈ వేదికలో తొలుత బ్యాటింగ్ చేసిన 8 జట్లు 6 సార్లు విజేతగా నిలిచాయి.
ఆఖరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124) శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్‌కు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.