రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సపోర్ట్ స్టాఫ్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్‌సీబీలో కొత్త శకం మొదలైందని, అక్కడ ఆటగాళ్లను కాకుండా మ్యాచ్ విన్నర్లను తయారు చేస్తున్నారని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడితో ఫలితాన్ని రాబడుతున్నారని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 28(శనివారం) ఈ మ్యాచ్ జరగనుంది. అప్‌కమింగ్ సీజన్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మహహ్మద్ కైఫ్ ఆర్‌సీబీ జట్టును విశ్లేషించాడు. రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను ఏ స్థానంలో ఆడిస్తారో అర్థం కావడం లేదని, అతని కోసం దేవదత్ పడిక్కల్‌ను పక్కనపెడుతారా? అనేది చూడాలన్నాడు.

'బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్.. బంతి బ్యాట్ మీదకు వచ్చేలా ఆడేవారికి, షాట్ మేకింగ్‌ను ఇష్టపడేవారికి, ఫాస్ట్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్లకు బాగా సహకరిస్తుంది. వెంకటేష్ అయ్యర్ వేగంగా వచ్చే బంతులను ఆడేందుకు ఇష్టపడతాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ తుది జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. వెంకటేష్ అయ్యర్‌ను ఏ స్థానంలో ఆడిస్తారో నాకు తెలియదు. గత సీజన్‌లో దేవదత్ పడిక్కల్ చాలా బాగా రాణించాడు.
పడిక్కల్, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీతో పాటు కోచ్‌ల గురించి మాట్లాడితే.. వారు జట్టులో ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు. టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి ఆటగాళ్లకు నిర్దిష్టమైన పాత్రలను అప్పగించారు. వారు కూడా మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఆర్‌సీబీ కోచ్‌లు ఇప్పుడు కొత్త ఆటగాళ్లను తయారు చేస్తున్నారు. అదే ఆ జట్టులో కనిపిస్తున్న ప్రధాన మార్పు.
ప్రధాన బౌలర్ హజెల్ వుడ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆరంభంలో ఆర్‌సీబీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ ప్రస్తుత కోచింగ్ స్టాఫ్ ఎవరిని జట్టులోకి తీసుకువచ్చినా వారి నుంచి ఆశించిన ఫలితాన్ని రాబడుతున్నారు. గత సీజన్‌లో ఆరు, ఏడు సార్లు ప్రత్యర్థి జట్లను 150 పరుగుల లోపే కట్టడి చేశారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు.
సుయాష్ వంటి ఆటగాడికి పెద్దగా అనుభవం లేకపోయినా.. అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు రాబట్టారు. కృనాల్ పాండ్యా తన బౌలింగ్‌తో మ్యాచ్‌లు గెలిపించాడు. రీప్లేస్‌మెంట్‌గా ఎవరు వచ్చినా వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్నారు. ఆటగాళ్లు తమ సామర్థ్యానికి మించి రాణించేలా ఆర్‌సీబీ కోచ్‌లు ప్రోత్సహిస్తున్నారు.
ఆర్‌సీబీ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఒక పేసర్‌ను వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లివింగ్ స్టోన్ వంటి ఆల్‌రౌండర్‌ను ఆర్‌సీబీ వదిలేసింది. కాబట్టి ఆరంభంలో కృనాల్, సుయాష్ మాత్రమే తుది జట్టులో ఉంటారని నేను అనుకుంటున్నా. ఈ ఇద్దరి బౌలింగ్‌లో మంచి నియంత్రణతో పాటు కచ్చితత్వం ఉంది. ఇద్దరూ తెలివైన బౌలర్లుగా మారారు. ఈసారి కూడా వారిపై చాలా బాధ్యత ఉంటుంది.
జోష్ హజెల్ వుడ్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫీని ఆడించాలి. అతని బౌన్స్ బెంగళూరు పిచ్‌కు సరిగ్గా సరిపోతుంది. అతని ఎక్స్‌ట్రా బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.