
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. భారత్-ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో అజారుద్దిన్ చేసిన ట్వీట్ ట్రోలింగ్‌కు దారి తీసింది. స్టువర్డ్ బ్రాడ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని చెప్పే తరుణంలోఅజారుద్దీన్ పప్పులో కాలేసాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు బదులు అతని తండ్రి క్రిస్ బ్రాడ్ పేరును ప్రస్తావించాడు. దాంతో నెటిజన్లు అజారుద్దీన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'క్రిస్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ గాయాలతో ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి బౌలర్లతో బరిలోకి దిగుతోంది. ఇది భారత్‌కు కలిసిరానుంది'అని ట్వీట్ చేశాడు.
దాంతో గాయంతో దూరమైంది స్టువర్ట్ బ్రాడ్ అని, క్రిస్ బ్రాడ్ అతని తండ్రని నెటిజన్లు అజారుద్దీన్ తప్పును తెలియజేస్తున్నారు. ఇంకొందరైతే.. అజ్జు భాయ్ మందు ఏసావా? అని ప్రశ్నిస్తున్నారు. తప్పుకుంది స్టువర్ట్ బ్రాడ్ అని, అతని అయ్య కాదని కామెంట్ చేస్తున్నారు. ఇది 1980 కాదని, 2021 అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఇంకొందరైతే ఈ ఇద్దరు దూరమైతే భారత్‌కు అడ్వాంటేజ్ ఏం ఉండదంటున్నారు. ఈ మధ్య వీళ్లు రాణించిందేం లేదని, ఫస్ట్ టెస్ట్‌లో కూడా భారత బ్యాట్స్‌మెన్ రాణించారని గుర్తు చేస్తున్నారు. మరికొందరూ ఈ ఇద్దరుంటేనే భారత్‌కు మంచిదని, యువ ఇంగ్లండ్ పేసర్లను అంచనా వేయడం కష్టమవుతుందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అజారుద్దీన్ చేసిన తప్పిదాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.
మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్‌లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్ బ్రాడ్ కాలిపిక్క గాయం కారణంగా మ్యాచ్‌తో పాటు పూర్తిగా సిరీస్‌కే దూరమవ్వగా.. తొడ గాయంతో బాధపడుతున్న అండర్సన్ రెండో టెస్ట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. 2016 తర్వాత ఈ ఇద్దరు ఒకేసారి మ్యాచ్‌కు దూరం కావడం ఇదే ఫస్ట్ టైమ్. బ్రాండ్ స్థానంలో మార్క్ వుడ్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన వుడ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం.
గాయంతో బాధపడుతున్న అండర్సన్ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్ మహమూద్‌ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్ ఎప్పుడో కుప్పకూలి చిత్తుగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి మళ్లీ టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.