ఐసీసీ దశాబ్దపు ఛీటర్ స్టీవ్ స్మిత్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌పై భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో స్మిత్ ఓర్వలేనితనంతో చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసింది. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ తన బ్యాటింగ్‌కు అనువుగా క్రీజులో చేసుకున్న గార్డ్ మార్క్‌ను స్మిత్ చెరిపివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాంతో ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ దుర్భుద్దిని అభిమానులు తప్పుబడుతున్నారు.
ఇంతకేం జరిగిందంటే..?
సోమవారం ఆటలో రెండో సెషన్‌లో ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్ చేసుకున్న మార్క్‌ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో భారత కెప్టెన్ అజింక్యా రహానేను ప్రశ్నించగా.. ఆ వీడియోని తాను చూడలేదని సున్నితంగా తిరస్కరించాడు. మరోవైపు ఈ వీడియోను దిగ్గజ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేశాడు. స్మిత్ ఎంతో ప్రయత్నించినా, ప్రయోజనం దక్కలేదని తనదైన శైలిలో సైటైర్లు సంధించాడు.

ఈ దశాబ్దపు చీటర్..
నిజాయతీగా ఆడాలని ప్రయత్నించకుండా, విజయం కోసం మరోసారి అడ్డదారులు తొక్కుతున్నావా అని స్మిత్‌ను అభిమానులు నిలదీస్తున్నారు. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ స్మిత్, వార్నర్‌పై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. మళ్లీ స్మిత్ అలానే ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు ఈ దశాబ్దపు చీటర్ స్మిత్ అని కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ దశాబ్దపు ఛీటర్ స్టీవ్ స్మిత్ అనే ఫోటోను ట్రెండింగ్ చేస్తున్నారు.

భారత్ పోరాటం అద్భుతం..
ఈ మూడో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. 272/5తో ఓటమి వైపు నిలిచిన జట్టును విహారి, అశ్విన్ ఆదుకున్నారు. చివరి వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఆసీస్ విజయానికి అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ పూర్తయ్యే సమయానికి భారత్ స్కోరును 334/5కి తీసుకెళ్లారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications