
ఆలస్యమైనా...
ముఖ్యంగా భారత క్రీడారంగంలో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరు నెలల జీతంతో మొదలైన ఈ విరాళల కార్యక్రమం తాజాగా రోహిత్ రూ. 80 లక్షల సాయం వరకు కొనసాగింది. కొనసాగుతోంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా తలో రూ.50 లక్షల విరాళం ప్రకటించగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ రూ. 3 కోట్ల సాయం చేశారు. అయితే అందరూ కొంచెం ముందే ప్రకటించగా.. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ ఆలస్యంగా స్పందించారు. దీంతో వారిపై గత రెండురోజులు తీవ్ర విమర్శలొచ్చాయి.
మన నాయకులకు అండగా ఉందాం..
ఈ నేపథ్యంలో విరుష్క జోడీ సోమవారం పీఎం కేర్స్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎంతా? అనే విషయం ప్రస్తవించలేదు. విరుష్క సన్నిహిత వర్గాల సమాచారం మేరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం రోహిత్ రూ.80 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు మంగళవారం రోహిత్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా పేదల భోజనానికి, వీధి కుక్కుల సంరక్షణ కోసం రోహిత్ ఈ విరాళమిచ్చాడు.
మనష్యులకే కాదు..జంతువులకు..
భారత దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. తన వంతు సాయంగా ఈ విరాళం అందించానన్నాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోదీతో పాటు నాయకులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా మనుష్యులే కాకుండా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన హిట్ మ్యాన్..విధి శునకాల సంక్షేమానికి తోడ్పాటుగా వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు తన విరాళంలో రూ.5 లక్షలు కేటాయించాడు. దీంతో జంతువులపై తనకున్న ప్రేమను రోహిత్ మరోసారి చాటుకున్నాడు.
బంగారమన్నా.. నువ్వు..
అయితే రోహిత్ సాయంపై అతని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ట్విటర్ వేదికగా హిట్ మ్యాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శెభాష్.. రోహిత్ అని ఒకరంటే.. కరోనాపై హిట్‌మ్యాన్ పర్ఫెక్ట్ షాట్ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ‘రోహిత్ భయ్యా.. 80 లక్షలు ఇచ్చిన నీ మనస్సు గొప్పది.. త్వరలోనే మరో 20 లక్షలు ఇచ్చి కోటీ భర్తీ చేస్తావ్'ఓ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకొందరు రోహిత్ అభిమానులుగా గర్వపడుతున్నామని తెలిపారు. బంగారమన్నా.. నువ్వు అంటూ తెలుగు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మనష్యులకే కాకుండా జంతువులను ఆదుకోవాలనే నీ తపన గొప్పదన్నా.. అని మరొకరు కామెంట్ చేశారు.
వైరస్ కట్టడి కోసం భారత మహిళా క్రికెటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ఇవ్వగా.. స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు, 16 ఏళ్ల రిచాఘోష్ రూ. లక్ష డొనేట్ చేశారు. పీవీ సింధు రూ.10 లక్షలు, సానియా మీర్జా రూ. కోటిన్నర విరాళలను ప్రకటించారు.


Click it and Unblock the Notifications












