
హైదరాబాద్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారా వైఫల్యం కొనసాగుతుంది. గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న ఈ సౌరాష్ట్ర ప్లేయర్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ విఫలమయ్యాడు. తనకు చావో రేవోగా మారిన కీలక మ్యాచ్‌లోనూ చేతులెత్తేశాడు. 23 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన అండర్సన్ బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్లు 126 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని అందించినా పుజారా స్వేచ్చగా ఆడలేకపోయాడు. వ్యక్తిగతంగా అతనిపై నెలకొన్ని ఒత్తిడిని అధిగమించలేక ఔటయ్యాడు. దాంతో పుజారా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
వాస్తవానికి పుజారా గత రెండేళ్లుగా సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడినా అంతకు ముందు ఆ తర్వాత పెద్దగా రాణించిందేం లేదు. 2019లో అతను చివరిసారిగా సెంచరీ చేశాడు. గతేడాది అతని బ్యాటింగ్ యావరేజ్ 28 కాగా.. ఈ ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో సగటు 20 మాత్రమే. ఈ రెండేళ్లలో అతను 22 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం ఐదు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
గత 10 ఇన్నింగ్స్‌ల్లో పుజారా 9, 12 నాటౌట్, 4, 15, 8, 17, 0, 21, 15 దారుణంగా విఫలమయ్యాడు. ఇన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. కానీ తాజా మ్యాచ్ వైఫల్యంతో అతను కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా యూకే చేరిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ క్వారంటైన్ పూర్తి చేసుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో పుజారా రాణించకుంటే వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు వరుస వైఫల్యాల నేపథ్యంలో పుజారా జట్టులో ఉండటం అవసరమా? అనే ప్రశ్న తలెత్తుంది. కొంత మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం పుజారాను పక్కనపెట్టాలని, యువ ఆటగాళ్లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉన్నప్పుడు పదేపదే అవకాశాలు ఇవ్వడం సమంజసమా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పుజారా కెరీర్ ముగిసిందని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదే పాకిస్థాన్ జట్టులో అయితే ఇప్పటికే పుజారపై వేటు వేసావారని అభిప్రాయపడుతున్నారు.
వర్షం అంతరాయం కలిగించడంతో నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి.
పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 127 బ్యాటింగ్) సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి.