అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో ఓ మ్యాచ్ ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్లు ఆడించాల్సి వచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ అరుదైన మ్యాచ్‌కు నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్స్ మధ్య జరిగిన ట్రై సిరీస్ వేదికైంది. ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్ల ద్వారా తేలింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు సూపర్ ఓవర్స్ ఆడించడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. అనంతరం నేపాల్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లూ 19 పరుగులే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.

రెండో సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో ఫలితం కోసం మూడోసారి సూపర్ ఓవర్ నిర్వహించగా.. నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ జాచ్ లయన్-కాచెట్ నేపాల్‌కు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 బంతుల్లో 2 వికెట్లు తీసాడు. దాంతో నెదర్లాండ్స్ లక్ష్యం ఒక్క పరుగుగా మారింది. లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ తొలి బంతినే సిక్సర్‌గా తరలించి విజయం సాధించింది.