WTC Final:ఇలా ఎప్పుడూ జరగలేదు! పాస్ పోర్టులు లాక్కొని.. ఐసీసీ గద ఎక్కడుందని అడిగారు: కివీస్ పేసర్

వెల్లింగ్‌టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఎన్నో ఏళ్లుగా వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ అందుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న కివీస్.. చివరకు టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్కసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది. దీంతో పట్టరాని సంతోషంలో ఉన్నారు కివీస్ ప్లేయర్స్ మరియు అభిమానులు.

పెద్ద ఎత్తున అభినందనలు
న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ విన్నింగ్ షాట్ కొట్టగానే కివీస్ డ్రస్సింగ్ రూమ్‌లో అసలైన సందడి మొదలైంది. ఆటగాళ్లు ఒకర్నొకరు హత్తుకొంటూ.. గెంతులు వేస్తూ.. పెద్దగా కేకలు వేస్తూ తమ ఆనందం పంచుకున్నారు.
అయితే శుక్రవారం స్వదేశానికి చేరుకున్న ఆ జట్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. కానీ వారితో కలిసి సంబరాలు చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆ జట్టు పేసర్ నీల్ వాగ్నర్ విచారం వ్యక్తం చేశాడు. కరోనా నిబంధనల కారణంగా దూరం నుంచే అభిమానులకు అభివాదం చేయాల్సి వచ్చిందని వివరించాడు.

కరచాలనం కూడా చేయలేకపోతున్నాం
'డబ్ల్యూటీసీ ఫైనల్ విజయం గురించి స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు. ప్రస్తుత కరోనా వైరస్ నిబంధనల్లో భాగంగా సామాజిక దూరం పాటించాలి. అందువల్ల అభిమానులతో కరచాలనం కూడా చేయలేకపోతున్నాం.
టెస్టు ఛాంపియన్‌గా మాకు ఐసీసీ గదను బహూకరించడంతో.. అభిమానులు దానితో ఫొటోలు తీసుకోవాలని ఆసక్తి చూపారు. కానీ అది కూడా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. అయితే అభిమానులు దూరం నుంచే చేతులు ఊపి అభినందించడం మా ఆటగాళ్లకు ఎంతో సంతోషం కలిగించింది' అని పేసర్ నీల్ వాగ్నర్ తెలిపాడు.
Ind vs Eng:వన్డే సమరానికి వేళాయే..టీమిండియా ఆశలన్నీ వారిపైనే!ఫామ్‌లో ఇంగ్లండ్! తుది జట్లు ఇవే!!

గద ఎక్కడుందని అడిగారు
'విమానాశ్రయంలోనూ కస్టమ్స్ అధికారులు మమ్మల్ని అభినందించారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మా పాస్ పోర్టులు లాక్కొని మరీ (సరదాగా) ఐసీసీ గద ఎక్కడుందని అడిగారు. ఫొటోలు దిగేందుకే అలా చేశారు. పోలీస్ అధికారులు కూడా ఫొటోలు తీసుకోవాలనుకోవడం, వాళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడటం అద్భుతంగా ఉంది.
విమానంలో రాత్రంతా మేము తలా కొంచెంసేపు ఆ గదను పట్టుకొని సంబరపడ్డాం. చివరికి రాస్ టేలర్ నా వద్ద నుంచి దాన్ని తీసుకొని బీజే వాట్లింగ్‌కు అందజేశాడు. న్యూజిలాండ్‌లో ఐసోలేషన్‌లో ఉండే రెండు వారాలు అది అతడి వద్దే ఉంటుంది' అని కివీస్ పేసర్ చెప్పుకొచ్చాడు. టీమిండియాతో ఫైనల్ మ్యాచే వాట్లింగ్ కెరీర్‌లో చివరి టెస్టు. దాంతో ఆ గదను అతడి వద్దే కొద్దిరోజులు ఉంచాలని న్యూజిలాండ్ జట్టు నిర్ణయించింది.

వరణుడు కీలక పాత్ర
సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వరణుడు కీలక పాత్ర పోషించాడు. రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మరో రెండు రోజులు పూర్తి ఆట సాధ్యపడలేదు. దాంతో రిజర్వు డేలో ఫలితం తేలుతుందో లేదోనని భావించారు. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడంతో స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగా అందుకుంది.
కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 249 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. 140 పరుగులు లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన కివీస్‌కి ఛాంపియన్‌షిప్ గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications