ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓటమికి తన బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని యువ బ్యాటర్ నెహాల్ వధేరా అన్నాడు. తాను ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే పంజాబ్ విజయం సాధించేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 191 పరుగుల లక్ష్యచేధనలో 18 బంతులాడిన నెహాల్ వధేరా 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో శశాంక్ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనల్ మ్యాచ్‌పై స్పందించిన నెహాల్ వధేరా.. తమ ఓటమికి పిచ్ కండిషన్స్‌ను సాకుగా చూపించలేనని స్పష్టం చేశాడు. తాను వేగంగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. 'ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో నేను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసుంటే ఖచ్చితంగా విజయం సాధించేవాళ్లం. పిచ్‌ను నేను నిందించను. ఎందుకంటే ఇదే వికెట్‌పై ఆర్‌సీబీ 190 పరుగులు చేసింది. నేను ఆటను ఆఖరి వరకు తీసుకెళ్తాం అనుకున్నాను. చివరి వరకు క్రీజులో ఉండి విజయలాంఛనాన్ని పూర్తి చేయాలని భావించాను. కానీ అలా చేయలేకపోయాను.

నేను ఇప్పటి వరకు ఆడిన టోర్నీల్లో వేగంగా ఆడిన ప్రతీసారి ఆశించిన ఫలితం దక్కింది. కానీ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం పత్రికూల ఫలితం ఎదురైంది. కొన్ని రోజులు మన ఆటకు అనుకూలించవు. ఆ రోజు కూడా నాకు కలిసి రాలేదు. ఇందుకు నాకు ఎలాంటి పశ్చాతాపం లేదు. వికెట్లు పడుతున్నా.. ఆటను చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. కానీ నేను ఇంకొంచెం వేగంగా ఆడాల్సింది. ఈ ఓటమి ద్వారా నేను నేర్చుకున్న విషయం ఇదే. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా ఆడే ప్రయత్నం చేస్తాను.
రెండో మ్యాచ్‌లోనే నాకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలేదు. అదృష్టవశాత్తూ.. ఆ మ్యాచ్‌లో మేం ముందుగా బౌలింగ్ చేశాం. ఛేజింగ్ సమయంలో రింకీ పాంటింగ్ వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాల్సి ఉంటుందని చెప్పాడు. నేను గత ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా నా దగ్గర ఒక్క క్రికెట్ కిట్ మాత్రమే ఉండేది. ఐపీఎల్‌కు కూడా ఒక్క కిట్‌తోనే వచ్చాను. సాధారణంగా ఆటగాళ్లు ఎక్స్‌ట్రా కిట్‌తో వస్తారు. నేను మాత్రం ఒక్క కిట్‌తోనే ఆడాలనుకున్నాను. ఆ మ్యాచ్‌లో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నేను నేరుగా రికీ పాంటింగ్ వద్దకు వెళ్లాను. మ్యాచ్‌ను ముగించాలని రికీ పాంటింగ్ చెప్పారు. నేను ముగిస్తానన్నాను. సహజంగా ఆడుతూ లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించాను.'అని నెహాల్ వధేరా చెప్పుకొచ్చాడు.