ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు టీమిండియా సన్నదమవుతోంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుస విజయాలతో టీమిండియా జోరు మీదున్నా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ అంటే అభిమానుల్లో కాస్త కంగారు మొదలైంది. ఎందుకంటే 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లోనూ కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు. అంతేకాకుండా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది.
ఫైనల్ జరిగే దుబాయ్ పిచ్ పరిస్థితులకు టీమిండియా అలవాటు పడినా.. ఈ వికెట్ తగ్గట్లు రాణించే ఆటగాళ్లు న్యూజిలాండ్‌లోనూ ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్.. టీమిండియాకు ప్రమాదకరం కానున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రీజులో సెట్ అయిన టెంబా బవుమా, రాసీ వాన్ డెర్ డస్సెన్‌తో పాటు డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్‌ను ఔట్ చేసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. లీగ్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతన్ని శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దాంతో అతను కేఎల్ రాహుల్‌ను మాత్రమే ఔట్ చేయగలడు. ఫైనల్లోనూ మిచెల్ సాంట్నర్‌కు వ్యతిరేకంగా టీమిండియా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగాలి. లేకుంటే టీమిండియా పతనాన్ని శాసించగలడు. ముఖ్యంగా కోహ్లీ, అయ్యర్, రాహుల్.. ప్రత్యేకమైన షాట్లతో సాంట్నర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది.
సాంట్నర్ చెలరేగితే టీమిండియాకు ఘోర పరాజయం తప్పదు. సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో సాంట్నర్ అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పతనాన్ని శాసించాడు. దాంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారి టీమిండియా సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ సిరీస్ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని టీమిండియా సన్నదమవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
ఈ ముంబై ఇండియన్స్ బౌలర్‌ను చితక్కొడితేనే టీమిండియాకు భారీ స్కోర్ దక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మిచెల్ సాంట్నర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.