న్యూఢిల్లీ: 'వీరేంద్ర సెహ్వాగ్ మా సింహ స్వప్నం. అతన్ని ఔట్ చేస్తే మేం మ్యాచ్ గెలిచినట్లే.'2005లో అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. సెహ్వాగ్ తన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లకు ఎన్నో పీడ కలలను మిగిల్చాడు. పాక్‌గడ్డపై ట్రిపుల్, డబుల్ సెంచరీలతో చెడుగుడు ఆడాడు.
పాకిస్థాన్‌పై 9 టెస్ట్‌ల్లోనే 1276 పరుగులు చేసిన సెహ్వాగ్.. ఓ ట్రిపుల్(309), రెండు డబుల్ సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించిన సెహ్వాగ్ 31 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1071 పరుగులు చేశాడు. వేదిక ఏదైనా.. పాక్ బౌలర్లను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఊచకోత కోసాడు.

అలాంటి సెహ్వాగ్‌ను తన మాటలతో రెచ్చగొట్టి ఔట్ చేశానని పాకిస్థాన్ మాజీ పేసర్ నవేద్ ఉల్ హసన్ తెలిపాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నవేద్ ఉల్ హసన్.. సెహ్వాగ్‌ను మాటలతో కవ్వించి ఔట్ చేసిన విధానాన్ని వివరించాడు. 2005 భారత పర్యటనలోని ఐదు వన్డేల సిరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాడు.
'భారత్‌తో మ్యాచ్‌లో సెహ్వాగ్ 85 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లోనే షాహిద్ అఫ్రిది వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. కీలకమైన మూడో వన్డేలో సెహ్వాగ్ మా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
భారత్ 300 పరుగుల భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. అఫ్రిది బౌలింగ్‌లో సెహ్వాగ్ అప్పటికే సిక్స్‌ల మోత మోగించాడు. పాక్ బౌలర్లలో ప్రతీ ఒక్కరు అతని ధాటికి పరుగులు సమర్పించుకున్నారు. నేను వెళ్లి ఇంజమామ్ ఉల్ హక్‌ను బౌలింగ్ చేస్తానని అడిగాను. అలాగే చేయ్.. అందరూ కొట్టించుకున్నారు. నువ్వు కూడా పరుగులు సమర్పించుకో అని ఎటకారంగా మాట్లాడాడు.
బంతిని అందుకున్న నేను సెహ్వాగ్‌కు తొలి బంతి స్లోయర్ బౌన్సర్‌గా వేసాను. దాన్ని సెహ్వాగ్ కనెక్ట్ చేయలేకపోయాడు. వెంటనే నేను అతని దగ్గరకు వెళ్లి 'ఈ బంతి ఎలా ఆడాలో నీకు తెలియదు. నువ్వు పాకిస్థాన్‌లో ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేవాడివే కాదు.'అని రెచ్చగొట్టాను. దానికి సెహ్వాగ్ కూడా మాటలతో బదులిచ్చాడు.
అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నేను వెంటనే ఇంజమామ్ దగ్గరకు వెళ్లి.. ఇప్పుడు సెహ్వాగ్ ఔట్ అవుతున్నాడని చెప్పాను. మరుసటి బంతిని బ్యాక్ ఆఫ్ హ్యండ్ స్లోయర్‌గా వేసాను. ఆగ్రహంగా ఉన్న సెహ్వాగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ వికెట్ మాకు మూమెంటమ్ అందించడంతో మ్యాచ్ గెలిచాం. ఆ తర్వాత సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్నాం.'అని నవేద్ ఉల్ హసన్ చెప్పుకొచ్చాడు.