ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో బంతిని మార్చి టీమిండియా మూల్యం చెల్లించుకుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ అన్నాడు. బంతిని మార్చడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఈజీగా పరుగులు రాబట్టారని తెలిపాడు. దాంతో ఇంగ్లండ్ అదనంగా 116 పరుగులు చేసిందని అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో కొత్త బంతితో బుమ్రా నిప్పులు చెరిగాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు. అయితే కొత్త బంతిని తీసుకున్న తర్వాత 10 ఓవర్ల వ్యవధిలోనే బంతి ఆకారం దెబ్బతిన్నదని, మార్చాలని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంపైర్‌ను కోరాడు.
గిల్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అంపైర్.. బంతిని మార్చాడు. అయితే మార్చిన బంతి 10 ఓవర్ల పాత బంతిలా లేదని, 20 ఓవర్ల పాత బంతిలా ఉందని అంపైర్‌తో శుభ్‌మన్ గిల్ వాగ్వాదానికి దిగాడు. సిరాజ్ కూడా మార్చిన బంతి సరిగ్గా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాత బంతితో సీమ్, స్వింగ్ రాకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టారు. 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. బంతి మార్పు కారణంగా అదనంగా 116 పరుగులు చేసి 387 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌కు సహకరిస్తున్న బంతిని మార్చాలని కోరడం తనకు విచిత్రంగా అనిపించిందని నాజర్ హుస్సేన్ అన్నాడు.

'బంతిని మార్చి టీమిండియా ఘోర తప్పిదం చేసింది. అయితే క్రికెట్‌లో బంతిని మార్చడానికి రెండు కారణాలు ఉంటాయి. బంతి ఆకారం దెబ్బతిన్నదని అంపైర్ భావించడం ఒకటైతే.. బౌలింగ్ అటాక్, కెప్టెన్ బంతితో ఏం చేయలేకపోతున్నామని, మార్చాలని అంపైర్‌ను కోరడం రెండో కారణం. కానీ ఉదయం బంతి అద్భుతంగా స్వింగ్ కావడంతో పాటు సీమ్ అయ్యింది. 63 బంతుల పాటు రెండు వైపులా స్వింగ్ అయ్యింది. బుమ్రా అద్భుతమైన స్పెల్‌ను వేసాడు. మరో ఎండ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్‌లు మిస్సయ్యాయి. బంతి వికెట్ కీపర్ వరకు బాగా క్యారీ అయింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో బంతి నుంచి కావాల్సిన మద్దతు బౌలర్లకు లభించింది.
బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తున్న బంతిని ఎందుకు మార్చాలనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. బంతి మార్చడం లేదని శుభ్‌మన్ గిల్ వాగ్వాదానికి దిగాడు. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. చేతిలో అద్భుతంగా స్వింగ్ అవుతున్న బంతిని మార్చి శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం చేశాడు. డ్యూక్స్ బాల్స్ అస్థిరంగా ఉంటాయనే విషయం అందరికీ తెలుసు. బంతి మార్చిన తర్వాత కూడా గిల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. మార్చిన బంతి కూడా బాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇదంతా విచిత్రంగా అనిపించింది.'అని నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. నిలకడగా ఆడుతోంది. యశస్వి జైస్వాల్(13), శుభ్‌మన్ గిల్(16) కరుణ్ నాయర్(40) నిరాశపర్చినా.. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు.