టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు. శుభ్‌మన్ గిల్ చెత్త కెప్టెన్సీ కారణంగానే ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా వెనుకంజలో నిలిచిందన్నాడు. మూడో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ వ్యూహాత్మక తప్పిదాలు చేశాడని, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రాలను సరిగ్గా వాడుకోలేకపోయాడని తెలిపాడు. గిల్ తప్పిదాలు.. ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చాయని అభిప్రాయపడ్డాడు.
మూడో రోజు ఆటను విష్లేశిస్తూ ది డెయిలీ మెయిల్‌కు రాసిన కథనంలో నాజర్ హుస్సేన్.. గిల్ తప్పిదాలను ప్రస్తావించాడు. 'ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ బ్రియాన్ స్టాథమ్ ఎండ్‌ను బౌలింగ్ చేశాడు. ఈ ఎండ్‌లో అతను బౌన్స్ రాబట్టాడు. కానీ బుమ్రా మాత్రం సర్ జిమ్మీ అండర్సన్ ఎండ్ నుంచి ఎక్కువగా బౌలింగ్ చేశాడు. రెండో రోజు టీ బ్రేక్ అనంతరం సూర్యుడు బయటకు రావడంతో పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. కానీ భారత్ మాత్రం వాషింగ్టన్ సుంద్‌ర్‌పై నమ్మకం ఉంచలేకపోయింది.

69వ ఓవర్ వరకు అతనికి బంతినివ్వలేదు. దాంతో ఇంగ్లండ్ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. సుందర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. లార్డ్స్ టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీసి.. విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో అన్న సుందర్‌పై నమ్మకం ఉంచలేదు. నేను ఇంత వరకు సుందర్‌లాంటి బౌలర్‌ను చూడలేదు. అతను ఇంగ్లండ్ కండిషన్స్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గాలికి వ్యతిరేకంగా టర్న్ రాబడుతున్నాడు.
బంతి అందుకోగానే అతను ప్రభావం చూపాడు. ఓలీ పోప్, హ్యారీ బ్రూక్‌లను వెనువెంటనే పెవిలియన్ చేర్చాడు. కానీ అతనితో ఆలస్యంగా బౌలింగ్ చేయించి గిల్ మూల్యం చెల్లించుకున్నాడు.'అని నాజర్ హుస్సేన్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.