న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు రాత్రిపూట ప్రాక్టీస్ సెషన్‌లు లభించకపోవడంపై నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టుకు ప్రాక్టీస్ షెడ్యూల్స్ కేటాయించడంలో అన్యాయం జరిగిందని, నిర్వాహకులు భారత జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించాడు. గురువారం న్యూఢిల్లీ వేదికగా భారత్, నమీబియా మ్యాచ్ జరగాల్సి ఉంది.
సోమవారం నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన నమీబియాకు భారత్ మ్యాచ్‌కు ముందు రెండు ప్రాక్టీస్ సెషన్స్‌ను పగటి పూటే కేటాయించారు. భారత జట్టుకు మాత్రం రెండు ప్రాక్టీస్ సెషన్లలో రాత్రి వేళలో ఇచ్చారు. ఇరు జట్ల మధ్య గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో జరిగే మ్యాచ్‌కు నైట్ ప్రాక్టీస్ సెషన్స్ అవసరమని, కానీ నిర్వాహకులు తమ పట్ల వివక్ష చూపారని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఎరాస్మస్ మాట్లాడుతూ.. నిర్వాహకుల తీరును తప్పుబట్టాడు. 'భారత్‌తో జరగబోయే ఈ నైట్ మ్యాచ్‌కు ముందు మాకు ఒక్క నైట్ ప్రాక్టీస్ సెషన్ కూడా కేటాయించలేదు. కానీ, భారత జట్టుకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారు. ఎందుకిలా జరిగిందో నాకు తెలియదు. దీనిపై మీరే ఓ అంచనాకు రావాలి.’ అని ఎరాస్మస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తమ దేశంలో ఫ్లడ్‌లైట్ల సౌకర్యం ఉన్న స్టేడియాలు లేవని, దాంతో తమ ఆటగాళ్లకు రాత్రిపూట ఆడిన అనుభవం చాలా తక్కువని ఎరాస్మస్ గుర్తుచేశాడు. 'మాకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడటం అంతగా అలవాటు లేదు. ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడిన కొందరు ఆటగాళ్లకు తప్ప మిగతా వారికి ఇది కొత్త. ఇలాంటి కీలక సమయంలో నైట్ ప్రాక్టీస్ సెషన్ లేకపోవడం మాకు నష్టాన్ని కలిగిస్తుంది.’ అని ఎరాస్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే, ఈ విషయాలను పట్టించుకోకుండా తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని ఎరాస్మస్ స్పష్టం చేశాడు. 'మేం మా నమీబియా పద్ధతిలో పోరాడతాం. పరిస్థితులను చూసి భయపడకుండా.. ఆటపై మాత్రమే దృష్టి పెడితే విజయావకాశాలు వాటంతట అవే వస్తాయి’ అని ఎరాస్మస్ ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన నమీబియాకు, భారత్‌తో జరగబోయే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భారత్ భావిస్తోంది.
నమీబియా కెప్టెన్ ఆరోపణలపై ఐసీసీ అధికారి ఒకరు స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ షెడ్యూళ్లను జనవరి 27నే అన్ని జట్లకు కేటాయించారని, నమీబియా జట్టు నైట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఫిబ్రవరి 10న అభ్యర్థన చేసిందని, దాంతోనే మార్పులు చేయడం సాధ్యం కాలేదని వివరణ ఇచ్చారు.