
చెన్నై: గతేడాది ఐపీఎల్ సందర్భంగా యువ ఆటగాళ్లలో కసి కనిపించడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ టీమ్ యువ ఆటగాడు ఎన్.జగదీశన్ తెలిపాడు. అవి యువ క్రికెటర్లను ఉద్దేశించినవి కావని, జట్టులోని అనుభవజ్ఞులు బాగా ఆడాలని మహీ పరోక్షంగా అన్నాడని చెప్పాడు. నిజానికి ఆ సీజన్లో రుతురాజ్, తాను బాగానే ఆడామని వెల్లడించాడు.
'ధోనీ భాయ్ కామెంట్స్‌ను మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. అవి యువకులను ఉద్దేశించినవి కావు. నిజానికి నేను, రుతురాజ్ బాగా ఆడాం. ఏదేమైనా సీనియర్లు సహా అందరిలోనూ ఆత్మవిశ్వాసం పెంచేది మహీనే. జట్టులోని సీనియర్లు దిగ్గజాలు. వారిని వేలెత్తి చూపలేరు కదా! అనుభవజ్ఞులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏదైనా చేయాలి. అందుకే ధోనీ వ్యాఖ్యల తర్వాత జట్టు బాగా ఆడింది' అని జగదీశన్ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్‌కేలో టెక్నికల్ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టరని, ప్రక్రియనే నమ్ముతారని అతను వెల్లడించాడు.
యూఏఈలో జరిగిన గత సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సురేశ్ రైనా దుబాయ్‌కు వచ్చాక వ్యక్తిగత కారణాలతో లీగ్ ముందు తప్పుకున్నాడు. హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో అక్కడికి రాలేదు. సీజన్‌కు ముందే రుతురాజ్, దీపక్ చాహర్ కరోనా బారిన పడ్డారు. సాధన చేసేందుకు వారికి తగిన సమయం దొరకలేదు. ధోనీ సహా మిగతా ఆటగాళ్లంతా పేలవంగా ఆడారు. ఓటములకు కారణం అడగ్గా.. 'యువకుల్లో కసి కనిపించలేదు' అని మహీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. మహీపై విమర్శలు వ్యక్తమయ్యాయి.