సంజూ శాంసన్ క్యాచ్‌ను వదిలేయడం తమ పతనాన్ని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. తన తప్పిదం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని అంగీకరించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్ దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ వదిలేసాడు. ఈ అవకాశంతో సంజూ శాంసన్ 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హ్యారీ బ్రూక్.. చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బౌలింగ్ తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ జట్టు పోరాడిన తీరు గర్వంగా ఉందని చెప్పాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కూడా తమ జట్టు వెనుకడుగు వేయలేదని తెలిపాడు.

'పిచ్ తాజాగా ఉండటం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు ఎక్కువ సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్‌పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. 'క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి'అని అంటారు కదా. దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్లు సాగలేదు. ప్రణాళికల అమల్లో కూడా తప్పిదం జరిగింది.

బౌలింగ్‌లో కూడా మేం సరిగ్గా రాణించలేదు. జాకబ్ బెతెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. భారీగా సంపాదిస్తాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనేంటో ప్రపంచానికి చూపించాడు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాను. 250 పరుగులు ఛేజ్ చేస్తూ ఈ రాత్రి అదే నిరూపించాం. ఇతర జట్లు అయితే ఈ పాటికి చేతులెత్తేసి కుప్పకూలిపోయేవి.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. . సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాకోబ్ బెతెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 ) శతకంతో ఒంటరి పోరాటం చేయగా.. విల్ జాక్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/38) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా(1/33), వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
