ముషీర్ ఖాన్.. గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీల మోత మోగిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్.. అన్నలానే అటాకింగ్ గేమ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. దూకుడుతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు తలపించే టెక్నిక్‌తో ఆకట్టుకుంటున్నాడు.
అండర్ 19 ప్రపంచకప్‌లో అతను ఆడిన షాట్స్.. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను తలపిస్తున్నాయి. ఈ ముగ్గురి ట్రేడ్ మార్క్ షాట్స్‌ను ముషీర్ ఖాన్ అలవోకగా బాదుతున్నాడు. దాంతో ఈ ముగ్గురి కలియికనే ముషీర్ ఖాన్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

దూకుడు, వైవిధ్యం, నిలకడతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. అసాధారణ ప్రదర్శనతో చెలరేగుతున్నాడు. ముషీర్ కొట్టిన హెలికాప్టర్, అప్పర్ కట్, రివర్స్ స్వీప్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ధోనీ, సచిన్, సూర్య ట్రేడ్ మార్క్ షాట్స్‌ను ముషీర్ సునాయసంగా ఆడటం చూసి ఆశ్చర్యపోయిన ఓ నెటిషన్.. ఈ వీడియోలను ఎడిట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వైవిధ్యమైన షాట్స్ ఆడేలా తన తండ్రి తనను తీర్చిదిద్దాడని ముషీర్ ఖాన్ తెలిపాడు. 'సూర్య భాయ్ బ్యాటింగ్‌ను బాగా దగ్గరగా చూసి అతనిలా ఆడటం నేర్చుకున్నాను. అతను మాత్రమే వైవిధ్యమైన షాట్స్ ఆడగలడు. అతనిలా ఆడేందుకు నేను ఎక్కువగా ప్రయత్నిస్తాను.'అని ముషీర్ ఖాన్ వెల్లడించాడు.
అండర్ 19 ప్రపంచకప్‌లో ముషీర్ ఖాన్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటుతో 325 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు చేసిన ముషీర్.. న్యూజిలాండ్‌పై 126 బంతుల్లో 131 పరుగులు సాధించాడు. యూఎస్‌పై 76 బంతుల్లో 73 రన్స్ చేశాడు.
నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 2016 అండర్ 19 ప్రపంచకప్‌లోనూ ముషీర్ సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో యంగ్ ఇండియా నేపాల్‌తో తలపడనుంది.