ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024 గెలవడం చాలా సంతోషంగా ఉందని అండర్ 19 సెన్సేషన్, ముంబై క్రికెటర్ ముషీర్ ఖాన్ తెలిపాడు. విదర్భతో వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రంజీ ట్రోఫీ చరిత్రలో 42వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన ముషీర్ ఖాన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక మ్యాచ్‌లో సత్తా చాటడం పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. అజింక్యా రహానే సహకారంతోనే తాను సెంచరీ చేయగలిగానని చెప్పాడు. 'ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ముఖ్యమైనది. ముంబై జట్టు కోసం వీలైనంత వరకు క్రీజులో ఉండాలని భావించాను. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరితో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై ఫోకస్ పెట్టాను.

రహానేతో కలిసి బ్యాటింగ్ చేయడం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన కుదిరింది. వీలైనంత వరకు చెత్త షాట్లు ఆడకుండా స్ట్రైట్ బ్యాట్‌తో ఆడాలని నిర్ణయించుకున్నాం. స్టార్ ఆటగాళ్లతో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం చాలా గర్వంగా ఉంది.
ముంబై జట్టు 42వ సారి రంజీ ట్రోఫీ గెలవడం సంతోషంగా ఉంది. ఇంకా నేను ఆడాల్సింది చాలా ఉంది. నా ప్రక్రియపై నేను ఫోకస్ పెట్టాను.'అని ముషీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన విదర్భ నిలకడగా ఆడింది. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (102; 199 బంతుల్లో), హర్ష్ దూబె (65; 128 బంతుల్లో) సాధికారికంగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. తొలి సెషన్‌లో ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే వారిద్దరి 130 పరుగుల భాగస్వామ్యం అనంతరం విదర్భ పతనం మొదలైంది. 15 పరుగులకే విదర్భ చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ 45.3 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ చేయడంతో విదర్భ ముందు భారీ లక్ష్యం నమోదైంది.