
ముంబై: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి ముంబై పోలీసులు వినూత్న రీతిలో బర్త్‌డే విషెస్ తెలిపారు. కరోనాతో దేశం అల్లాడుతున్న వేళ ఎంఎస్‌డీ పేరుకు కొత్త అర్థం చెబుతూ మహీకి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంగళవారం(జూలై 7)తో జార్ఖండ్ డైనమైట్ 39వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీస్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఎంఎస్‌డీ అంటే 'మెయింటెయిన్ సోషల్ డిస్టెన్సింగ్' అని చెబుతున్న ఆ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. క్రికెట్ మైదానం, దాని మధ్యలో వికెట్లు, బ్యాటు, బంతి.. వాటితో పాటు 'ఎంఎస్‌డీ.. మెయింటెన్ సోషల్ డిస్టెన్సింగ్' అనే అక్షరాలు ఈ ఫోటోలో కనిపిస్తాయి.
ఇదిలా ఉంటే ఈ ఫోటోకు ముంబై పోలీస్ ఇచ్చిన కాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. కరోనాను జయించాలని, అందుకోసం ధోనీలానే నాట్ అవుట్‌గా ఉండాలని, కరోనా వైరస్‌ను స్టంప్ అవుట్ చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ.. కెప్టెన్ కూల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెరైటీ విషెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముంబై పోలీసుల క్రియేటివ్‌ను మెచ్చుకుంటున్నారు.