టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత ఏడాదిన్నరగా సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అమెరికాపై ఆడిన ఇన్నింగ్స్ మినహా మరే మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ రాణించిందిలేదు. సింగిల్ డిజిట్ స్కోర్లతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకు తీవ్ర నష్టం చేస్తున్నాడు.
తనకు అచ్చొచ్చిన ఐపీఎల్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ చేతులెత్తేసాడు. అతని వైఫల్యం ముంబై ఇండియన్స్ కొంపముంచుతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 20.25 సగటు, 140.87 స్ట్రైక్‌రేట్‌తో 162 పరుగులే చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. గత 6 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6, 33, 0, 15, 36, 5 పరుగులే చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులే చేసి వెనుదిరిగాడు. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో సూర్య వైఫల్యం జట్టుకు నష్టం చేసింది. కీలకమైన మిడిల్ ఓవర్లలో సూర్య 5 బంతులు ఆడి ఐదు పరుగులే చేసు వెనుదిరిగాడు. సూర్య కాస్త దూకుడుగా ఆడి ఉంటే ముంబై ఇండియన్స్ తమ స్కోర్‌కు 10-20 పరుగులు అదనంగా చేసేది.

అప్పుడు ఆ జట్టు విజయవకాశాలు ఇంకా మెరుగయ్యేవి. ఏది ఏమైనా ఫస్ట్ డౌన్‌లో ఆడే సూర్య వైఫల్యం ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసిస్తోంది. సూర్యకోసం ఇన్ ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మను లోయరార్డర్‌లో ఆడించడంతో అతను కూడా నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నాడు.
ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి సూర్య ఇబ్బంది పడుతున్నాడని, అతని కెరీర్ ముగిసిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆడిన ఇన్నింగ్స్‌లు, పేరుతో ఇంకెన్నాళ్లు సూర్య నెట్టుకొస్తాడని, అతనికి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే..'ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం'అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ తరహాలోనే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా తడబడింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తే తప్పా ముంబై టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.