
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపుతున్నాడు. చేతి వేలి గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సూర్య.. లేటుగా ఎంట్రీ ఇచ్చి లేటేస్ట్‌గా చెలరేగుతున్నాడు. వరుస మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీలు నమోదు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తన ఫస్ట్ మ్యాచ్‌లోను అర్ధ సెంచరీ సాధించి జట్టును అదుకున్న సూర్య.. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లోను అదే జోరును కొనసాగించాడు.
79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని సూర్య (37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలోజయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు క్విక్ డబుల్, సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. ఈ హాఫ్ సెంచరీని వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. ఇక సూర్య నమస్కారం సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే తాజాగా ఆ సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సూర్య తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు వచ్చారని, అందుకే సూర్య ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాడని ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. సూర్యతో పాటు అతని తల్లిదండ్రుల ఫొటోను షేర్ చేసింది. ఇక సిరాజ్ ఓవర్‌లో హెలికాప్టర్ షాట్‌తో సూర్య కొట్టిన 98 మీటర్ల భారీ సిక్స్ వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్).. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.