ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్దమైంది. నవంబర్ 31న ఈ మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించిన బీసీసీఐ ఆరుగురి ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆరుగురి ఆటగాళ్లలో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్స్, ఇద్దరు అనామక ఆటగాళ్లు ఉండాలని పేర్కొంది.
ఈ ఆరుగురిని నేరుగా లేదా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వరుసగా ముగ్గురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో , ఐదో ఆటగాడు కావాలనుకుంటే మళ్లీ రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు కేటాయించాలి. అనామక ఆటగాళ్లను రూ. 4 కోట్లకు తీసుకోవచ్చు. టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు.

అక్టోబర్ 31వ తేదీలోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని బీసీసీఐ.. ఫ్రాంచైజీలను ఆదేశించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ జాబితాలను సిద్దం చేసుకున్నాయి. ఓ జాతీయ ఛానెల్ వివరాల ప్రకారం ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడుతాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగేందుకు రోహిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీకి మించిన ఆఫర్ ఏదో రోహిత్‌కు ఇచ్చినట్లు సమాచారం.
తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, ఇషాన్ కిషన్‌లను ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయాలని ముంబై భావిస్తున్నట్లు సమాచారం. నలుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకుంటే ముంబైకి రెండు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఉంటాయి. ఈ రెండింటితో వేలంతో ముగ్గురి ఆటగాళ్లను ముంబై టార్గెట్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే.. రూ. 61 కోట్లు ఖర్చు అవుతోంది. మరో రూ. 59 కోట్లతోనే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.