ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఆరో టైటిల్ కోసం గత 5 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో చివరిసారిగా విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత మళ్లీ టైటిల్ అందుకోలేకపోయింది. ఈ ఐదేళ్ల కాలంలో రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. మరో రెండు సార్లు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఒకసారి మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఐదేళ్లుగా ముంబై ప్రదర్శన ఆశాజనకంగా లేదు.
స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా.. ప్రతిభకు లోటు లేకున్నా...ముంబై ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతుంది. కనీసం ఈసారైనా టైటిల్ పట్టాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ ఉంది. అందుకు తగ్గట్లునే ఐపీఎల్ 2026 వేలంలో వ్యవహరించింది. ఈ మినీ వేలంలో అత్యల్పంగా రూ.2.75 కోట్లతోనే బరిలోకి దిగిన ముంబై తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను అతని బేస్ ప్రైజ్ రూ. 1 కోటికి కొనుగోలు చేసింది.

ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకోవడంతో పాటు వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా తమకు కావాల్సిన ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకుంది. శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్, మయాంక్ మార్కండేలను ట్రేడ్ చేసుకుంది. దాంతో ఈ వేలంలో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా పనిలేకుండా పోయింది. చేతిలో రూ.2.75 కోట్లే ఉన్నా.. చాకచక్యంగా వ్యవహరించి కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్‌కు బ్యాకప్ ఓపెనర్‌తో పాటు వికెట్ కీపర్ అవసరం ఉండగా.. డికాక్‌తో ఆ రెండు స్థానాలను భర్తీ చేసింది. డికాక్‌తో పాటు డానిష్ మలెవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావంత్ వంటి అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రధాన ఆటగాళ్లతో పేపర్‌పై ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ సారి ముంబై కప్ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రధాన ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్ల చేరికతో ముంబై కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండటంతో అతను రెగ్యులర్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్‌లో ఒకరు ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.
హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. నమన్‌ధీర్, మయాంక్ మార్కండేలు ఇంపాక్ల ప్లేయర్లుగా ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిచెల్ సాంట్నర్ బరిలోకి దిగనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది.
రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్/ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విల్ జాక్స్, నమన్ ధీర్/మయాంక్ మార్కండే(ఇంపాక్ట్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.