భారీ అంచనాలతో ఐపీఎల్ 2026 సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ అందుకు తగ్గట్లుగానే శుభారంభం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించి 13 ఏళ్ల తర్వాత ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. దాంతో ముంబై ఇండియన్స్‌కు తిరుగులేదని అంతా అనుకున్నారు.
జట్టు నిండా అంతర్జాతీయ స్టార్లు, నలుగురు వరల్డ్ టీమ్ కెప్టెన్లు ఉండటంతో ఈ టోర్నీలో ముంబై ఇండియన్సే విజేతగా నిలుస్తుందని 14 మంది స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేసారు. వారే కాదు ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, జెమీనై, గ్రోక్, మెటా ఏఐ అన్నీ టైటిల్ గెలిచే అవకాశాలు ముంబై ఇండియన్స్‌కే ఉన్నాయని జోస్యం చెప్పాయి. కానీ ముంబై ఇండియన్స్ అనూహ్యంగా హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో ఓడి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. జట్టు నిండా అంతర్జాతీయ స్టార్లు ఉన్నా.. పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్.. లాకాఫ్ ప్లానింగ్ ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసిస్తున్నాయి.
వరల్డ్ బెస్ట్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ తీయకపోవడం గమనార్హం. రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. గాయపడటం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. తిలక్ వర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండటం కూడా ఆ జట్టుకు నష్టం చేస్తోంది.

టోర్నీకి ముందు ముంబై ఇండియన్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతుందని చెప్పిన వారంతా.. ఆ జట్టు ఆటను చూసి నివ్వెరపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ పుంజుకొని ప్లే ఆఫ్స్ చేరుతుందా? అంటే అవునని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ టోర్నీలో ముంబై 4 మ్యాచ్‌లే ఆడింది. ఇంకా 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏం సంక్లిష్టంగా లేవు. చివరి 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. 8 గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది.
ఐపీఎల్‌లో లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. టాప్-4లో చోటు దక్కాలంటే ప్రతీ జట్టు కనీసం 8 విజయాలతో 16 పాయింట్స్ సాధించాలి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి మరో 7 గెలిస్తే సరిపోతుంది. ఓడిన మ్యాచ్‌ల్లో కూడా రన్‌రేట్ దెబ్బతినకుండా ప్రదర్శన చేయాలి. మరీ ముంబై తిరిగి పుంజుకుంటుందా? లేక తమ తడబాటు కొనసాగిస్తుందా? అనేది చూడాలి.

ఏప్రిల్ 16 (గురువారం): ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, వాంఖడే స్టేడియం (ముంబై), రాత్రి 7:30 గంటలకు.
ఏప్రిల్ 20 (సోమవారం): ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం (అహ్మదాబాద్), రాత్రి 7:30 గంటలకు.
ఏప్రిల్ 23 (గురువారం): ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, వాంఖడే స్టేడియం (ముంబై), రాత్రి 7:30 గంటలకు.
ఏప్రిల్ 29 (బుధవారం): ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వాంఖడే స్టేడియం (ముంబై), రాత్రి 7:30 గంటలకు.
మే 02 (శనివారం): ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, MA చిదంబరం స్టేడియం (చెన్నై), రాత్రి 7:30 గంటలకు.
మే 04 (సోమవారం): ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, వాంఖడే స్టేడియం (ముంబై), రాత్రి 7:30 గంటలకు.
మే 10 (ఆదివారం): ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం (రాయ్‌పూర్), రాత్రి 7:30 గంటలకు.
మే 14 (గురువారం): ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, HPCA స్టేడియం (ధర్మశాల), రాత్రి 7:30 గంటలకు.
మే 20 (బుధవారం): ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), రాత్రి 7:30 గంటలకు.
మే 24 (ఆదివారం): ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, వాంఖడే స్టేడియం (ముంబై), మధ్యాహ్నం 3:30 గంటలకు.