టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మంచి పని చేశాడని మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. తాను సెలెక్టర్‌గా ఉన్నా ఇదే చేసేవాడినని తెలిపారు. 12 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు రోహిత్ శర్మ బుధవారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సింపుల్‌గా ఇన్‌స్టా స్టోరీలో రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం హిట్ మ్యాన్ పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు మరింత మంచిగా ఉండాలని ఆకాంక్షించారు. అతని ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి మంచి పనిచేశాడు. 200 శాతం ఇది సరైన నిర్ణయం. ఎందుకంటే ఇంగ్లండ్ పర్యటనతో కొత్త డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఫామ్‌లో లేని రోహిత్ శర్మను జట్టులో కొనసాగించడం సరికాదు. అంతేకాకుండా అతని వయసు 38 ఏళ్లు. ఈ సైకిల్ పూర్తయ్యేసరికి 40 ఏళ్లకు వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని జట్టులోకి తీసుకోవడం సరైనది కాదు. నాకు తెలిసి సెలెక్టర్లు ఇదే విషయంపై రోహిత్‌కు సంకేతం ఇచ్చి ఉండొచ్చు. లేకుంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేవాడు కాదు.
ఆస్ట్రేలియా పర్యటనలో కూడా మరో సిరీస్ ఆడుతాడని రోహిత్ చెప్పాడు. అలాంటి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడంటే మరికొద్ది రోజుల్లోనే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. నేను సెలెక్టర్‌గా ఉన్నా ఇదే చేసేవాడిని. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సీనియర్లు తప్పుకోవాల్సిందే. సరైన సమయంలో రోహిత్ గౌరవంగా తప్పుకున్నాడు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.