హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయకపోవడానికి తాను ఒక్కడినే కారణం కాదని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఇటీవల ఓ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు.. ఎమ్మెస్కేతో కెరీర్ ప్రారంభంలో ఉన్న విభేదాలే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుండా చేశాయని ఆరోపించాడు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెస్కేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే మరో తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడి ఆరోపణలకు సమాధానమిచ్చాడు.

2019 ప్రపంచకప్ జట్టులో రాయుడి ఎంపికచేయకపోవడం సెలెక్షన్ కమిటీ సమష్టిగా తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. కానీ చాలా మంది తన వల్లే రాయుడు ప్రపంచకప్ ఆడలేకపోయాడని విమర్శిస్తున్నారని, అసలు రాయుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికే తానే అసలు కారణమని తెలిపాడు. ఇది చాలా మందికి తెలియదని, ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదన్నాడు.
'రాయుడి సెలెక్షన్ వ్యవహారం గురించి నేను ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేసేటప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నాతో పాటు కోచ్, కెప్టెన్ అంతా ఉంటారు. నా కులం వాడనో, నా రాష్ట్రం వాడనో ఒక ఆటగాడిని ఎంపిక చేయడం కుదరదు. అయినా ఎవ్వరికీ తెలియని విషయం చెబుతా.
నాలుగేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు రాయుడును జట్టులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అతనితో మాట్లాడాలనుకున్నా. అయితే, అతను ఫోన్ వాడడని తెలిసి మీడియా మిత్రుల సాయంతో రాయుడి ఫ్యామిలీ ఫోన్ నెంబర్ తీసుకొని అతనితో మాట్లాడా.
రూల్స్ ప్రకారం ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరవ్వమని రాయుడుకు చెప్పా. అందులో అతను విఫలమయ్యాడు. వెంటనే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉండమని చెప్పి అక్కడి ట్రైనర్లతో మాట్లాడి మళ్లీ ఫిట్‌నెస్ మెరుగుపరచుకునేలా చేసి భారత్-ఎ జట్టులో ఆడేలా చేశా. రాయుడుపై నాకు ప్రత్యేక శ్రద్ధ ఉండబట్టే కదా ఇదంతా చేసింది.
ఓ ఆటగాడి కోసం మరే సెలెక్షన్ కమిటీ చైర్మన్ అయినా ఇలా చేశాడా? ఇవన్నీ ఎవరికీ తెలియవు. రాయుడుకు కూడా నా గురించి తెలుసు. ఆ విషయంలో అతను నన్నెప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు కూడా. నేను కమిటీ చైర్మన్‌గా అయ్యాకే రాయుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడన్న విషయం అందరూ తెలుసుకోవాలి.
ఆ వరల్డ్‌క్‌పలో రాయుడును కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడానికి అతను ఆల్‌రౌండర్ కావడమే ప్రధాన కారణం. రాయుడు విషయంలో నేనేం చేశానన్నది ఇప్పటికైనా స్పష్టత వస్తుందనుకుంటున్నా.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.