తన వల్లే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గొప్ప టెస్ట్ ప్లేయర్ అయ్యాడని మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. టెస్ట్ టీమ్‌లోకి రిషభ్ పంత్‌ను ఎంపిక చేయాలని తాను ప్రతిపాదించినప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌తో సహా అందరూ వ్యతిరేకించారని తెలిపాడు. తాను పట్టుబట్టి రిషభ్ పంత్‌ను టెస్ట్ టీమ్‌లోకి ఎంపిక చేశానన్నాడు.
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా వేదికగా వచ్చే సర్కార్ ప్రోగ్రామ్ 6వ ఎపిసోడ్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ తన సహచర తెలుగు కామెంటేటర్లు కౌశిక్, కళ్యాణ్, వింధ్య విశాఖతో కలిసి హాజరయ్యాడు. ఈ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో చీఫ్ సెలెక్టర్‌గా తన అనుభవాలను ఎమ్మెస్కే ప్రసాద్ పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తీరుతో పాటు రిషభ్ పంత్ టెస్ట్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
'రిషభ్ పంత్‌ను టెస్ట్ టీమ్‌లోకి తీసుకున్నప్పుడు నాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంత్‌కు గ్లోవ్స్ వేసుకోవడం కూడా తెలియదని విమర్శించారు. రిషభ్ పంత్‌ను వైట్ డ్రెస్‌లో చూడలేమని కూడా అన్నారు. రిషభ్ పంత్‌ను టెస్ట్‌ల్లోకి తీసుకునేందుకు ఎంతో మందిని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. మేనేజ్‌మెంట్‌తో పాటు మా సెలెక్టర్లతో ఫైట్ చేయాల్సి వచ్చింది.

రిషభ్ పంత్‌ను టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవడం చాలా మందికి నచ్చలేదు. కానీ తొలి మ్యాచ్‌లోనే రిషభ్ పంత్ 10 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఇప్పుడు భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప వికెట్ కీపర్‌గా నిలిచాడు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ ఆరంభంలో ధోనీ అండగా నిలవడంతోనే కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడని చెప్పాడు. ' ఒకానొక సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి, ఫిట్‌నెస్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టాలనుకున్నారు. కానీ ధోనీ ఒక్కడే కోహ్లీకి అండగా నిలబడి, విరాటే భారత క్రికెట్ భవిష్యత్తు అని నమ్మి అవకాశాలు ఇచ్చాడు. ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టి వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఎదిగాడు.
తన లక్ష్యాన్ని అందుకునేందుకు కోహ్లీ చాలా కష్టపడ్డాడని, తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌ను కూడా పూర్తిగా పక్కనపెట్టాడు. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్‌ను తగ్గించాడు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.