
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మిగిలిన టెస్టుల్లో తెలుగు క్రికెటర్ హనుమ విహారిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపించాలని.. విదేశాల్లో ఆడే టెస్టుల్లో సాహాకు బదులు పంత్‌కు తుది జట్టులో ప్రాధాన్యం ఇవ్వాలని టీమిండియా సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఫస్ట్ టెస్ట్‌లో హనుమ విహారి(16, 8)అందరిలానే తొలి టెస్ట్‌లో నిరాశపరిచాడు. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో విహారి విఫలమయ్యాడని, లోయారార్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి బ్యాటింగ్ చెయ్యాల్సి వస్తుండటంతో తెలుగు కుర్రాడిపై ఒత్తిడి నెలకొందని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. అతనికి బ్యాటింగ్ ప్రమోషన్ ఇస్తే రాణిస్తాడని తెలిపాడు.
'హనుమ విహారి టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంటుంది. తర్వాత జరిగే టెస్టుల్లో అతన్ని నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడించాలి. రాహుల్ ఆరో స్థానానికి సరిపోతాడు. కోహ్లీ లేని సమయంలో కేఎల్ రాహుల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆడేటప్పుడు వికెట్‌కీపర్‌గా రిషభ్ పంత్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. భారత్ గడ్డపై ఆడేటప్పుడు ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌కు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పుడు.. స్పెషలిస్టు వికెట్‌కీపర్‌ను ఎంచుకోవచ్చు'అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
అయితే కంకషన్ గాయానికి గురైన రవీంద్ర జడేజా కోలుకోవడంతో విహారి చోటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బాక్సింగ్ డే టేస్ట్‌కు జడేజా అందుబాటులో ఉంటాడని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. అదే జరిగితే.. విహారి తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు. పైగా జడేజా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌తో త్రీ డైమన్షన్ ప్లేయర్. దాంతో అతను జట్టులోకి రావడ ఖాయంగా అనిపిస్తోంది.