MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లవ్ గురు అవతారమెత్తాడు. పెళ్లి కానీ బ్యాచిలర్స్‌కు కీలక సలహా ఇచ్చాడు. వివాహ బంధం ఎలా ఉంటుందో.. జీవితంలో అది ఎంత ముఖ్యమో వివరించాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఎవరితో సంతోషంగా ఉంటారని భావిస్తారో వారినే పెళ్లి చేసుకోవాలని సూచించాడు.
'మీరు ఎవరితో సంతోషంగా ఉంటారో వారినే పెళ్లి చేసుకోండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్‌లర్స్‌లో ఉండే ఓ దురభిప్రాయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. 'నా గర్ల్ ఫ్రెండ్ మిగిలిన వారి కంటే భిన్నం'అని మాత్రం అనుకోవద్దు.'అని ధోనీ చెప్పగానే అక్కడ నవ్వులు పూసాయి. పెళ్లి వల్ల జీవితంలో ఎంత స్థిరత్వం వచ్చిందని ధోనీని ప్రశ్నించగా.. అనుభవంతో కూడిన సమాధానమిచ్చాడు.

'మీలో ఎంత మందికి పెళ్లైంది. ఇలా అడిగితే చాలా మంది నవ్వుతారు. కానీ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది పక్కనపెడితే ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. భవిష్యత్తులో పెళ్లి చేసుకుందామనుకునేవారు ఎంత మంది ఉన్నారు? మీరు ఆ బంధాన్ని ఎలా చూస్తున్నారన్న అంశంపైనే అది ఆధారపడి ఉంటుంది. మీ జీవితానికి కావాల్సిన మసాలా పెళ్లి నుంచే వస్తుంది.
భాగస్వామి రాకతో మీ జీవితం క్రమం తప్పకుండా నడుస్తోంది. మీరు భారత జట్టు కెప్టెనా.. మాజీ కెప్టెనా..? అనేది వారికి అనవసరం. మీరు వారికి భర్త మాత్రమే. మీరనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. కానీ వాళ్లు అనుకున్నదే మీతో చేయిస్తారు. మీ నిర్ణయం ప్రకారమే అది చేశారు అనిపిస్తారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం.. నేను ముందే చెప్పాను. మీరు వినలేదని అంటారు. ఇవన్నీ సరదాగా చెప్పుకున్నా.. మన బలానికి మూలస్తంభం మాత్రం మన జీవిత భాగస్వామినే'అని పెళ్లి గొప్పతనాన్ని ధోనీ వివరించాడు.
మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆడుతానని ఇప్పటికే ప్రకటించిన ధోనీ.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ అనంతరం మోకాలి సర్జరీ చేసుకున్న ధోనీ.. అప్‌కమింగ్ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు.