టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తన భావోద్వేగాలను ప్రదర్శించడు. గెలిచినా.. ఓడినా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే అతన్ని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అలాంటి ధోనీ 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.
కోపంతో మైదానంలోకి దూసుకెళ్లాడు. మ్యాచ్ ఉత్కంఠగా మారిన సమయంలో బెన్ స్టోక్స్ వేసిన స్లోయర్ ఫుల్ టాస్‌ను నోబాల్‌గా ప్రకటించకపోవడంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలోకి దూసుకెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ బంతిని ముందుగా నో బాల్ ప్రకటించిన ఫీల్డ్ అంపైర్.. ఆ తర్వా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

ఇది ధోనీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంపైర్లతో వాగ్వాదం దిగడం ఐపీఎల్ రూల్స్‌కు విరుద్దం కావడంతో ధోనీ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. టోర్నీ నిర్వాహకులు ధోనీకి జరిమానా విధించారు. తాజాగా ఈ ఘటనను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ మోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మోహిత్ శర్మ.. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు.
'ఆ రోజు నాతో పాటు చెన్నై ఆటగాళ్లంతా డగౌట్‌లో కూర్చున్నాం. ధోనీ మైదానంలోకి వెళ్లవద్దని కోరుకున్నాం. కానీ ధోనీ వెనక్కి చూడకుండానే మైదానంలోకి దూసుకెళ్లాడు. ప్రతీ ఒక్కరు .. సింహం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినట్లు ధోనీని చూశారు. ఆ ఘటనకు ముందే ధోనీ ఔటయ్యాడు. దాంతో కాస్త ఆగ్రహంగా ఉన్నాడు.
ఆ మ్యాచ్‌ను ధోనీనే ముగించాలనుకున్నాడు. సహజంగా ధోనీ ఇతరులకు మ్యాచ్‌ను ముగించే పనిని వదిలిపెట్టడు. కానీ ఆ రోజు ఔటయ్యాడు. ఔటయ్యాక వచ్చి కూర్చోగానే ఈ ఘటన జరిగింది. నోబాల్ ఇచ్చారా? లేదా అని మమ్మల్ని అడిగాడు. మేం అవును సిగ్నల్ ఇచ్చారని చెప్పాం. అంతే కోపంతో ధోనీ మైదానంలోకి దూసుకెళ్లాడు. తిరిగి వచ్చాక నన్ను లాప్‌టాప్ అడిగాడు. వీడియో అనలిస్ట్ ఆ వీడియోను చూపించి అది క్లియర్‌గా నో బాల్ అని చెప్పాడు.'అని మోహీత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో 58 పరుగులతో రాణించి ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తాను చేసిన పనికి క్షమాపణలు కూడా కోరాడు. అయినప్పటికీ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ధోనీ కెరీర్‌లోనే ఈ ఘటన ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.